ఇదెక్కడి ట్విస్టు.. రెండు పార్ట్ లుగా 'విశ్వంభర'?
ABN, Publish Date - May 12 , 2026 | 02:31 PM
టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్, రెండు పార్ట్ లుగా సినిమాలను విడుదల చేసే ట్రెండ్ జోరుగా సాగుతోంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్, రెండు పార్ట్ లుగా సినిమాలను విడుదల చేసే ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 'విశ్వంభరస (Vishwambhara)చిత్రాన్ని కూడా మేకర్స్ రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై దర్శకుడు వశిష్ట స్పందిస్తూ.. “అవునా.. నిజమా?” అంటూ కాస్త వెటకారంగా రియాక్ట్ అయ్యారు. తద్వారా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మించే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఇది సింగిల్ పార్ట్‌గానే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం చిత్రంలో ఉన్న భారీ స్థాయి విజువల్ ఎఫెక్స్ (VFX), గ్రాఫిక్స్ పనులు. సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడి ఉండటంతో, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర బృందం భావిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తూ, అద్భుతమైన అవుట్‌పుట్ కోసం సమయం తీసుకుంటున్నారు.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) అద్భుతమైన పాటలను అందిస్తున్నారు. అయితే, నేపథ్య సంగీతం (BGM) విషయంలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ‘హనుమాన్’ చిత్రంతో గుర్తింపు పొందిన గౌర హరి (Hari Gowra )ని రంగంలోకి దించినట్లు సమాచారం. విజువల్స్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉండాలని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కీరవాణి బాణీలు, గౌర హరి సంగీతం తోడవ్వడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
‘విశ్వంభర’ కథాంశం చాలా వైవిధ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది. పురాణాల్లోని సృష్టి, స్థితి, లయ అనే మూడు అంశాల నేపథ్యంలో ఈ సోషియో ఫాంటసీ కథ సాగుతుంది. గతంలో చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని వినోదం, ‘హిట్లర్’ చిత్రంలోని అక్కాచెల్లెళ్ల సెంటిమెంట్ ఈ సినిమాలో మేళవించినట్లు సమాచారం. అంటే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్ కూడా ఈ చిత్రంలో సమపాళ్లలో ఉండబోతోంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష (Trisha) కథానాయికగా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా వంటి నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త మాయా ప్రపంచాన్ని పరిచయం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ మళ్ళీ తన ఫేవరెట్ జోనర్ అయిన సోషియో ఫాంటసీలోకి రావడం పట్ల అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.