ముగిసిన థియేటర్ల వివాదం.. 'పెద్ది'కి లైన్ క్లియర్
ABN, Publish Date - May 27 , 2026 | 08:41 PM
తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య థియేటర్ల అద్దె విషయమై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య థియేటర్ల అద్దె విషయమై గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. థియేటర్ల ప్రదర్శనలో అద్దె విధానానికి బదులు పర్సెంటేజ్ విధానాన్ని తీసుకురావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వహణా సంఘం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఇక ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అవ్వడంతో ఇండస్ట్రీ మరింత హీట్ ఎక్కింది. తాజాగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఆయన ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. బుధవారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్, అనుపమ్ రెడ్డి, బాలగోవింద్ రాజు, భరత్ నారంగ్ తదితరులు.. మెగాస్టార్ నివాసంలో భేటీ అయ్యారు. పెద్ది సినిమా నుంచే పర్సెంటేజ్ విధానాన్ని అమలు పర్చే నిర్ణయాన్ని ఆయన ముందు ఉంచడం జరిగింది.
ఎగ్జిబిటర్లతో చిరంజీవి చర్చించి.. చివరకు ఒక ఒప్పందానికి వచ్చి ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. 'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యనిర్వహణా సంఘం ఏర్పాటు చేసిన ఉపసంఘం పేర్కొన్న కాలపరిమితి (30 జూన్ 2026) లోగా శాతాల విధానాన్ని సాధించేలా, ఉపసంఘం సమావేశాలను, ఫలితాలను తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని శ్రీ చిరంజీవి గారు హామీ ఇచ్చారు.
చిరంజీవి గారి హామీ మేరకు, 'పెద్ది' సినిమా సజావుగా విడుదలయ్యేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జారీ చేసిన లేఖకు కట్టుబడి ఉంటామని మేము అంగీకరించాము. ఒప్పందం ప్రకారం, కొత్త శాతం విధానాన్ని 2026 జూన్ 30వ తేదీ నాటికి నిర్ణయించి, దానిని 2026 జూలై 3వ తేదీ నుండి అమలు చేయడం జరుగుతుంది. 3 జూలై 2026 నుండి అద్దె విధానం ఉండదు.. సినిమాలు కేవలం శాతం పద్ధతిలో మాత్రమే ప్రదర్శించబడతాయ' అని తెలిపారు. ఇక దీంతో పెద్దికి లైన్ క్లియర్ అయ్యినట్టే.