Kaaka: ‘కాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్..
ABN, Publish Date - Oct 11 , 2026 | 10:19 AM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’(Kaaka) సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు పనిని వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయిందని, డిసెంబర్ మొదటి వారం నాటికి షూటింగ్ ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చిత్ర బృందం నుంచి సమాచారం.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి మెగాస్టార్‌ను సరికొత్త పాత్రలో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని, మాస్ అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు కూడా ఉంటాయట. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తునట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఆయన ఇందులో పోలీస్ అధికారిగా కనిపించనున్నారని, ఈ పాత్రలో విభిన్న కోణాలు ఉంటాయని టాక్.
KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాలను వేగంగా ముగించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.