Chiranjeevi: చరణ్ కష్టాన్ని దగ్గరుండి చూశాను.. ఫలితం దక్కింది
ABN, Publish Date - Jun 04 , 2026 | 05:09 PM
రామ్ చరణ్, పెద్ది చిత్రం గురించి చిరంజీవి భావోద్వేగా పోస్ట్ చేశారు. షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని ఆయన ట్వీట్ చేశారు.
రామ్ చరణ్(Ram Charan), పెద్ది చిత్రం గురించి చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగా పోస్ట్ చేశారు. షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘పెద్ది’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రిగా, నటుడిగా తనకెంతో సంతోషంగా ఉందని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు.
‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, పెట్టిన శ్రద్థాసక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’ అని రామ్‌చరణ్‌ను చిరంజీవి ప్రశంసించారు.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు. అలాగే తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట సతీశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్‌కు, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబుకు అభినందనలు. చక్కని పాటలు, హృదయాన్ని కదిలించేలా నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్‌కు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్యేందుతోపాటు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. ‘పెద్ది’ సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.