సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫౌజీ డేట్‌పై విశ్వంభర కన్ను.. అంతా వారణాసి దయ

ABN, Publish Date - Nov 28 , 2026 | 09:24 PM

టాలీవుడ్‌లో భారీ సినిమాల విడుదల తేదీలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతుండగా, అదే తేదీని విశ్వంభర కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభాస్ ఫౌజీ, మహేష్ బాబు వారణాసి సినిమాల విడుదల తేదీల్లోనూ మార్పులు రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్‌పై ఉత్కంఠ నెలకొంది.

Tollywood

సంక్రాంతి సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల చుట్టూ ఆసక్తికరమైన సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు భారీ చిత్రాలు కాకా(Kaaka), విశ్వంభర(Vishwambhara) ఒకే సమయంలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న కాకా చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర కూడా అదే జనవరి 13 స్లాట్‌ను లక్ష్యంగా చేసుకుందని, దాంతో కాకా వాయిదా పడవచ్చని ఇటీవల ప్రచారం జరిగింది.


కానీ, కాకా టీమ్ సంక్రాంతి బరిలో నిలిచే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే నైజాం రైట్స్ క్లోజ్ చేసుకోవడంతో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వంభర సినిమానే మరో తేదీకి మారే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. శివరాత్రి సీజన్‌ను గానీ, లేదా మార్చి 19వ తేదీని గానీ విశ్వంభర కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి 19వ తేదీ ఖాళీ కావాలంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫౌజీ సినిమా తన రిలీజ్ డేట్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతున్న ఫౌజీ కనుక ఏప్రిల్ 7వ తేదీకి మారితేనే ఆ స్లాట్ విశ్వంభరకు దక్కుతుంది. మరోవైపు ఏప్రిల్ 7న విడుదల కావాల్సిన ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు భారీ చిత్రం వారణాసి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో, ఆ డేట్‌పై ఫౌజీ కన్నేసినట్లు చర్చ నడుస్తోంది.


ఇలా చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు ఒకదానికొకటి ముడిపడి ఉండటం టాలీవుడ్‌లో ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పటివరకు ఏ చిత్ర బృందం కూడా తమ రిలీజ్ డేట్ల మార్పుపై అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి కాకా సంక్రాంతి రేసులో బలంగా నిలవగా, విశ్వంభర, ఫౌజీ, వారణాసి మేకర్స్ వచ్చే ఏడాది కొత్త డేట్స్ చూసుకొనే పనిలో ఉన్నారట. దీంతో వారణాసి ఒక్కటి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే.. మిగతావి వెంటవెంటనే తమ రిలీజ్ డేట్స్ ని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయని టాక్. మరి జక్కన్న వారణాసి రిలీజ్ డేట్ పై ఎప్పుడు స్పష్టత ఇస్తాడో చూడాలి.

Updated Date - Nov 28 , 2026 | 09:28 PM