Vishwambhara: సమయం లేదు మిత్రమా.. ఏం చేసినా నాలుగు రోజుల్లోనే!
ABN, Publish Date - Aug 28 , 2026 | 08:33 AM
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట (Vassishta) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలపై గత కొంతకాలంగా అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా షూటింగ్‌తో చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అందరి దృష్టి విశ్వంభరపైనే నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నుండి వస్తున్న తాజా వార్తలు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం, అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను దసరా బరిలో నిలపాలని చిత్రబృందం భావిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా అవుట్‌పుట్ మరింత ఆసక్తికరంగా, ప్రేక్షకులను మెప్పించేలా ఉండేందుకు కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
ఈ రీషూట్ కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే కేటాయించారట. ఈ స్వల్ప వ్యవధిలోనే పెండింగ్‌లో ఉన్న రీషూట్ భాగాలన్నింటినీ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన విఎఫ్‌ఎక్స్ పనులు అత్యంత నాణ్యంగా వచ్చేలా నిపుణులు పనిచేస్తున్నారు. గ్రాఫిక్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక కమర్షియల్ పరంగా చూస్తే, నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకోవడానికి మేకర్స్ నాన్-థియేట్రికల్ హక్కుల డీల్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన అందాల తార త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, మౌనీరాయ్ ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక సంగీతం విషయానికి వస్తే, ఎం.ఎం.కీరవాణి పాటలు సమకూరుస్తుండగా, హరి గౌర నేపధ్య సంగీతాన్ని అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.