చిరంజీవి అభిమానులకు డబుల్ ధమాకా!
ABN, Publish Date - Apr 21 , 2026 | 02:16 PM
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ను రెండు ఆనందం పంచే వార్తలు దరి చేరాయి... అందులో ఒకటి పాత సినిమాకు సంబంధించిన న్యూస్... మరోటి కొత్త చిత్రానికి చెందినది... ఇంతకూ ఏమిటవి!?
'వాల్తేరు వీరయ్య' తరువాత చిరంజీవి (Chiranjeevi) కి డైరెక్ట్ హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాగా 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) ను చెప్పుకోవాలి. జనవరి 12వ తేదీన సంక్రాంతి బరిలో నిలచిన ఈ మూవీ ఏప్రిల్ 21తో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ రెండు కేంద్రాలలో డైరెక్ట్ గా శతదినోత్సవం పూర్తి చేసుకోవడం విశేషం. ఈ రెండు సెంటర్స్ కడప జిల్లాలోవే కావడం మరింత విశేషం. కడప జిల్లా మైదుకూరు వేంకటేశ్వర థియేటర్, యర్రగుంట్ల హేమ పిక్చర్ ప్యాలెస్ లో 'మన శంకరవరప్రసాద్ గారు' డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకుంది. ఈ యేడాది ఇప్పటి వరకూ బ్లాక్ బస్టర్ మూవీగా నిలచిన ఈ సినిమానే ఈ సంవత్సరపు తొలి శతదినోత్సవం కూడా కావడం గమనార్హం!. ఇది ఫ్యాన్స్ కు ఆనందం పంచిన ఫస్ట్ న్యూస్ కాగా, మరోటి ఏమిటంటే చిరంజీవి 'కాకాజీ' అనే టైటిల్ లో నటించబోతున్నారు.
గతంలో 'వాల్తేరు వీరయ్య' చిత్రం కూడా సంక్రాంతి సంబరాల్లోనే పాలు పంచుకొని అవనిగడ్డ సెంటర్ లో విజయోత్సవాలు చేసుకుంది. ఆ తరువాత మళ్ళీ అంతటి ఊపునిచ్చిన చిరంజీవి చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' నిలచింది. 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి దర్శకత్వం వహించిన బాబీ డైరెక్షన్ లోనే చిరంజీవి మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను కేవీయన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికే 'కాకాజీ' అన్న టైటిల్ ను నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 'కాకా' అంటూ బాబాయ్ ని పిలుస్తూ ఉంటారు. అలాగే సన్నిహితులను సైతం 'కాకా' అంటూ అభిమానంగా పిలవడం కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు 'అన్నయ్య'గా జనం మదిలో నిలచిన చిరంజీవిని ఇప్పుడు ఆయన వయసుకు తగ్గట్టుగా 'కాకాజీ' పాత్రలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు బాబీ. ఈ అంశం కూడా ఫ్యాన్స్ కు అమితానందం కలిగిస్తోంది.
అప్పుడు అన్నయ్యగా... ఇప్పుడు కాకాజీగా...
ప్రస్తుతం చిరంజీవి కమిట్ అయిన సినిమాల్లో 'కాకాజీ' కూడా చేరింది. ఇది కాకుండా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటుడు నాని ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇక చిరంజీవి నటించిన 'విశ్వంభర' కూడా ఈ యేడాది జనం ముందుకు రానుంది. ఇలా మూడు చిత్రాలతో రంజింప చేయడానికి చిరంజీవి హుషారుగా సాగుతున్నారు. ఏడుపదులు దాటినా టైటిల్ రోల్స్ పోషించి ఘనవిజయం సాధించిన స్టార్స్ లో నటరత్న యన్టీఆర్ ముందుంటారు. ఆ తరువాత రజనీకాంత్, ఇప్పుడు చిరంజీవి కూడా 70 ఏళ్ళయినా హీరోలుగా సక్సెస్ రూటులోనే సాగుతూ ఉండడం విశేషం. రాబోయే చిత్రాలతో చిరంజీవి ఏ తీరున ఫ్యాన్స్ కు ఆనందం పంచుతారో చూడాలి.