చిరంజీవి: ఎన్టీఆర్ తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు తీసుకెళ్లారు..
ABN, Publish Date - Mar 20 , 2026 | 11:06 AM
చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘గద్దర్’ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఉగాది సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు,
తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు..
ఎన్టీఆర్ అంటే... N- నాట్యం, T - తాళం, R -రాగం... కళల సమ్మేళనం.
తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు..
దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా...
ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ...
రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది.
అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.