Chiranjeevi: ‘మనకెందుకులే’ అని మౌనంగా ఉండొద్దు.. ఏఐ దుర్వినియోగంపై చిరు ఫైర్
ABN, Publish Date - Oct 04 , 2026 | 01:58 PM
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా పెరుగుతుండటంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా పెరుగుతుండటంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మహిళలను అత్యంత హేయంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోలు రూపొందించడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ఒక్క వ్యక్తికి లేదా ఒక్క సినిమాకు సంబంధించిన సమస్య కాదని.. రేపు ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
"AI టెక్నాలజీని ఉపయోగించి ఒక మహిళను అత్యంత అవమానకరంగా చిత్రీకరించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. AIతో ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను రూపొందించడం, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం అమానుషం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదు. ఈరోజు ఒకరికి ఎదురైన పరిస్థితి.. రేపు మీకు, నాకు లేదా ఎవరికైనా ఎదురుకావచ్చు. ఒకరి గౌరవానికి భంగం కలుగుతున్నప్పుడు ‘మనకెందుకులే’ అంటూ మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఈ దుర్వినియోగాన్ని అరికట్టడంలో మనందరికీ బాధ్యత ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారితో పాటు, వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారిని కూడా చట్టపరంగా జవాబుదారీ చేయాలి. వీటిని సరదాగానో, వినోదంగానో తీసుకొని తేలికగా వదిలేయకూడదు' అని పేర్కొన్నారు.
సినిమా కుటుంబం ఒక్కటిగా ముందుకు రావాలి
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సినీ సంఘాలతో మాట్లాడి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నేను సిఫార్సు చేస్తున్నాను. ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకునేలా ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ.. బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను సంబంధిత ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి. మన సంఘాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు.. అందరం సమష్టిగా కృషి చేయాలి. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇలాంటి అభ్యంతరకరమైన వీడియోలను దయచేసి చూడకండి.. షేర్ చేయకండి. ఖండించే ఉద్దేశంతోనైనా వాటిని మళ్లీ పోస్ట్ చేయవద్దు. వాటిని వైరల్ చేయడం సమస్యను మరింత పెంచుతుంది. బదులుగా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు, సైబర్ క్రైమ్ అధికారులకు రిపోర్ట్ చేయండి. మనిషి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఆ బాధ్యతను మనమంతా కలిసికట్టుగా నిర్వర్తిద్దాం' అని పేర్కొన్నారు.