చిరు, ఏషియన్ బిగ్ ప్లాన్.. హైదరాబాద్‌కు వరల్డ్స్ లార్జెస్ట్ స్క్రీన్!
ABN , Publish Date - Sep 20 , 2026 | 08:09 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ సంయుక్తంగా ప్రపంచంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.
భారతీయ చలనచిత్ర రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ నగర కీర్తికిరీటంలో మరో అంతర్జాతీయ మైలురాయి చేరనుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ప్రముఖ చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) అధినేత సునీల్ నారంగ్ (Suniel Narang) సంయుక్తంగా ప్రపంచంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలోని ప్రముఖ ఐటీ, వాణిజ్య కేంద్రమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ భారీ మల్టీప్లెక్స్‌ను (Asian Megastar Chiranjeevi -AMC) నిర్మించనున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రానున్న ఈ థియేటర్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేయబోతుండటం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే అంతర్జాతీయంగా జర్మనీకి చెందిన ‘ట్రాంపలాస్ట్ లియోన్‌బర్గ్’ (127 ft x 69 ft), ఆస్ట్రేలియాలోని ‘ఐమాక్స్ మెల్‌బోర్న్’ (105 ft x 75 ft), అమెరికాలోని ‘రాయల్ సినిమాస్’ (101 ft x 76.2 ft), ‘ఏఎమ్‌సీ లింకన్ స్క్వేర్’ (101 ft x 75.6 ft) ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్లుగా ఖ్యాతికెక్కాయి. అలాగే హైదరాబాద్‌లోని ‘ప్రసాద్స్ పీసీఎక్స్’ (98 ft x 64 ft), లండన్‌లోని ‘బీఎఫ్ఐ ఐమాక్స్’ (85 ft x 65 ft) అగ్రశ్రేణిలో కొనసాగుతున్నాయి. అయితే, వీటన్నింటి రికార్డులను తిరగరాస్తూ, అంతర్జాతీయ కొలతలను మించి ఈ కొత్త ప్రాజెక్ట్ స్క్రీన్ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌తో ప్రపంచ స్థాయి వీక్షణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీని రూపకల్పన సాగుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో మల్టీప్లెక్స్ బిజినెస్‌ను కొత్త పుంతలు తొక్కించడంలో ఏషియన్ గ్రూప్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘ఏఎంబీ సినిమాస్’ (AMB), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘ఏఏఏ సినిమాస్’ (AAA), విజయ్ దేవరకొండతో ‘ఏవీడీ సినిమాస్’ (AVD), మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘ఏఆర్‌టీ సినిమాస్’ (ART) వంటి అత్యాధునిక థియేటర్లను నిర్మించి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ వరుసలో మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయితే అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవాన్ని అందించే కేంద్రంగా హైదరాబాద్ గ్లోబల్ మ్యాప్‌లో మరింత ప్రత్యేక గుర్తింపును దక్కించుకోవడం ఖాయం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలోనే వస్తుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు ఊపందుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
రీజనబుల్‌గానే.. ‘ద ప్యారడైజ్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
‘కోకో కొకొరొకో’.. అదిరిపోయే ఐటమ్‌తో వచ్చిన ‘ముగ్గురు కోతులు’
చిరు లీక్స్: ‘కాకా’ క్యారెక్టర్ పేరు లీక్.. ఎంత పని చేశావ్ స్రవంతి?