Chinmayi Ghatrazu: యాక్టింగ్ నుండి డైరెక్షన్ లోకి...
ABN, Publish Date - Jan 17 , 2026 | 01:21 PM
'అనగనగా ఒక రాజు' చిత్రానికి రచన చేసి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించింది చిన్మయి. అయితే ఆమె గతంలో తెలుగులో 'ఎల్.బి.డబ్ల్యూ', 'లవ్లీ', 'ఛమ్మక్ ఛల్లో' తదితర చిత్రాల్లో నటించింది.
చిన్మయి ఘట్రాజు... (Chinmayi Ghatrazu) ఈ పేరు పెద్దంత పాపులర్ కాదు, కానీ గత వారం రోజులుగా 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju) మూవీ ప్రమోషన్స్ ను చూస్తున్న వారికి ఈ అమ్మాయి చిరపరిచితమే! వరంగల్ లో జరిగిన 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లోనూ తేనెకళ్ళ సోయగం చిన్మయి తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది.
నవీన్ పోలిశెట్టి (Naveen Polishetti), మీనాక్షి చౌదరి (Meenakshi Choudary) జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై విజయపథంలో సాగిపోతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారి పరిచయం అయ్యాడు. అయితే ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి. అంతేకాదు ఈ చిత్ర కథను తయారు చేయడంతో పాటు రైటర్ గానూ తన సత్తాను చాటుకుంది. నవీన్ పోలిశెట్టితో పాటు కలిసి ఈ సినిమాకు చిన్మయి రచన చేసింది. ఈ మూవీ మేకింగ్ లో చిన్మయి తన ఫుల్ ఎఫర్ట్ ను పెట్టింది. ఇటు రైటింగ్, అటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో తనదైన ముద్రను వేసిన చిన్మయి బేసికల్ గా నటి అంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. చిన్మయిని 'అనగనగా ఒక రాజు' మూవీ ప్రమోషన్స్ లో స్టేజ్ మీద చూసినప్పుడు కొందరికి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఇంత అందమైన అమ్మాయా? అనే సందేహం కలిగి ఉండొచ్చు. ఫ్యాషన్ వేర్ తో స్టేజ్ ని స్పెల్ బౌండ్ చేసిన చిన్మయి డీఎన్ఎ లోనే యాక్టింగ్ అనేది ఉంది.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ఎల్.బి.డబ్ల్యూ.' (L.B.W.) లో చిన్మయి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 2011లో వచ్చింది. ఆమెతో పాటు మరో హీరోయిన్ గా సంగీత దర్శకుడు, గీత రచయిత ఇ. ఎస్. మూర్తి కుమార్తె నిశాంతి (Nishanthi) నటించింది. ఇక మేల్ క్యారెక్టర్స్ ను ఆసీఫ్ తాజ్, రోహన్ గుడ్లవల్లేటి, సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అభిజిత్ పూండ్ల (Abhijith Pundla) చేశారు. ఆ సినిమా తర్వాత బి. జయ దర్శకత్వం వహించిన 'లవ్లీ' (Lovely) లోనూ, నీలకంఠ మూవీ 'చమ్మక్ చల్లో' లోనూ చిన్మయి నటించింది. కానీ మొదటి నుండి దర్శకత్వం మీద మక్కువ ఉండటంతో ఆ రంగంలోనే పేరు తెచ్చుకోవాలని చిన్మయి నిర్ణయించుకుంది. కొన్నేళ్ళుగా ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. చివరకు నవీన్ పోలిశెట్టి తో కలిసి 'అనగనగా ఒక రాజు'కు రచన చేయడంతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ గా తన పేరును తెర మీద చూసుకోగలిగింది. తెలుగులో మహిళా దర్శకులు మరీ వేళ్ళ మీద లెక్కపెట్టే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో... అతి త్వరలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా చిన్మయి ఘట్రాజు పేరును త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద చూసే ఆస్కారం ఉంది.