సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాలీవుడ్‌లో మారుతున్న చిల్డ్రన్ సెంటిమెంట్ ట్రెండ్..

ABN, Publish Date - Nov 14 , 2026 | 06:10 PM

బాలల దినోత్సవం రాగానే మన సినీఫ్యాన్స్ బాలల చిత్రాలనూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చైల్డ్ సెంటిమెంట్ పండితే కాసుల వర్షం కురుస్తుందని సినీజనం నమ్ముతూ ఉంటారు.

Childrens Day

బాలల దినోత్సవం రాగానే మన సినీఫ్యాన్స్ బాలల చిత్రాలనూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చైల్డ్ సెంటిమెంట్ పండితే కాసుల వర్షం కురుస్తుందని సినీజనం నమ్ముతూ ఉంటారు. అయితే బాలలను ప్రభావితం చేసే చిత్రాలు వస్తున్నాయా అన్నదే ప్రశ్న...?


బాలలను ప్రభావితం చేసే చిత్రాలు రావాలని, అప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని ఎప్పటి నుంచో సినీపెద్దలు చెబుతున్నారు. అయితే నవతరాన్నీ ఆకట్టుకొనే ప్రయత్నంలో భావిపౌరులయిన బాలలను విస్మరిస్తున్నారు సినీజనం. ఇప్పుడొస్తున్న మన చిత్రాల్లో హింస, అసభ్యత, అశ్లీలం పెరిగిపోతున్నాయి. అవి నేరుగా బాలల మనసుపై ప్రభావం చూపిస్తున్నాయి. అయినా కాసుల వర్షం కోసం సినీజనం యంగ్ జనరేషన్ ను ఆకట్టుకొనే ప్రయత్నంలో వయలెన్స్, సెక్స్ కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మన సంస్కృతీ సంప్రదాయాలను, సాంకేతికపరమైన విజ్ఞానాన్ని చొప్పించి సినిమాలను తెరకెక్కిస్తూ బాలలను ఆకట్టుకుంటున్నారు. మరి కొందరు బాలలను లోతుగా ఆలోచింప చేసే సినిమాలనూ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన తెలుగు చిత్రాలు సమ్మర్ హాలీడేస్, జయంత్ అండ్ ద జింగోపెన్ వంటివి అదే తీరున సాగాయి.


దేశంలోని బాలబాలికల్లో సామాజిక, జాతీయ, రాజకీయ చైతన్యం తీసుకురావాలని భావించారు సినీపెద్దలు. అందుకోసం అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు ఉపకరిస్తాయని కేంద్ర ప్రభుత్వం తలచింది. ఆ ఆలోచన నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే మొగ్గతొడిగినా, కార్యరూపం దాల్చడానికి దాదాపు పదిహేనేళ్ళు పట్టింది. అలా 1979లో ముంబైలో తొలి అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరిగింది. తరువాత దేశంలోని పలు మహానగరాల్లోనూ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిమ్ ఫెస్టివల్స్ సాగాయి. 1995లో హైదరాబాద్ లో బాలల చిత్రోత్సవం జరిగింది. అది అంతకు ముందు జరిగిన చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్స్ కన్నా మిన్నగా సాగింది. దాంతో హైదరాబాద్ నే బాలల చలనచిత్రోత్సవాలకు శాశ్వతవేదికగా చేశారు. అప్పటి నుంచీ ప్రతి రెండేళ్ళకోసారి ఈ చిత్రోత్సవాలు జరిగాయి. అలా 2017లో చివరి చిత్రోత్సవం ఆనందం పంచింది. అంతకు ముందు చలనచిత్రోత్సవాలతో సంబంధం లేకుండా కొందరు మూవీమేకర్స్ బాలల్లో చైతన్యం కలిగించడానికి అదే పనిగా చిల్డ్రన్ పిక్చర్స్ తెరకెక్కించేవారు. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు వెలుగు చూశాక, మరిన్ని బాలల చిత్రాలు రూపొందడం మొదలయింది. ఈ మధ్య ఆ సందడి కూడా సద్దుమణిగింది. అయితే పూర్తిస్థాయి బాలల చిత్రాలు కాకపోయినా చైల్డ్ సెంటిమెంట్ తో కొన్ని సినిమాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల విడుదలయిన విజయ్ సేతుపతి బత్తా చిత్రం బాలలను ఆలోచింప చేసేలా తెరకెక్కింది.ఇందులో కరడుగట్టిన ఓ రౌడీని కరిగిపోయేలా చేసే ఓ బాలుడి పాత్ర ఆకట్టుకొనేలా రూపొందింది.


'బాలన్-ద బాయ్, ఓ మై గాడ్' వంటి చిత్రాల్లోనూ బాలల పాత్రలు రక్తి కట్టించాయి. విజయ్ సేతుపతి వంటి స్టార్ నటించడంతో బత్తా చిత్రం బంపర్ హిట్ గా నిలచింది. బాలలతో స్టార్స్ ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చునని పరిశీలకులు అంటున్నారు. గతంలో ఆమిర్ ఖాన్ తన తారే జమీన్ పర్ లో అదే తీరున చిల్డ్రన్ సెంటిమెంట్ ను చొప్పించి దేశవ్యాప్తంగా బాలలను అలరించారు. ఇలా స్టార్స్ కూడా బాలలతో ప్రధాన పాత్రలు పోషింప చేస్తూ చిత్రాలు రూపొందించినప్పుడే చైతన్యం తాండవిస్తుందని పరిశీలకుల మాట. దాంతో పాటు సినిమా స్కూల్స్ ద్వారా డైరెక్టర్, సినిమాటోగ్రఫి, ఆర్ట్..వంటి పట్టాలు సాధిస్తున్నవారు కూడా చిల్డ్రన్ ఫిలిమ్స్ పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. మరి ఎందరు యంగ్ మూవీమేకర్స్ పెద్దల సూచనలు పాటిస్తారో అన్నది సందేహం. ఏది ఏమైనా రాబోయే రోజుల్లోనైనా బాలలను ప్రభావితం చేసే చిత్రాలు అధిక సంఖ్యలో వస్తాయేమో చూద్దాం.

Updated Date - Nov 14 , 2026 | 06:10 PM