Cyber Crime: చైల్డ్ పోర్నోగ్రఫీపై నిఘా.. ఎవరు చూస్తున్నారో తెలిసిపోతుంది
ABN, Publish Date - Jan 23 , 2026 | 07:55 AM
చైల్డ్ పోర్నోగ్రఫీపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆదాయం కోసం ఇష్టారాజ్యంగా అసభ్యకర వీడియోలను తయారు చేసి, సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు.
చైల్డ్ పోర్నోగ్రఫీ (child pornography)పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆదాయం కోసం ఇష్టారాజ్యంగా అసభ్యకర వీడియోలను తయారు చేసి, సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు. తాజాగా ఇద్దరు బాలికల అశ్లీల కంటెంట్‌ను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ప్రసారం చేస్తున్న యూ ట్యూబర్‌ను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్‌కు చెందిన వైరల్ హబ్ ఛానల్ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఇకపై మరింత కఠినంగా ఉంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
చూసినా, షేర్ చేసినా జైలుకే..
చిన్న పిల్లల అదృశ్యం, వారిపై జరిగే నేరాలను గుర్తించి తక్షణమే స్పందించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్ పనిచేస్తోంది. ఇంటర్ నెట్, సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ పై నిఘా ఉంచినప్పుడు చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్, షేరింగ్, సర్క్యులేటింగ్, చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్క్ కు పాల్పడే వారిని గుర్తిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం ఇంటర్నెట్ లో వెతికిన వారి ఐపీ అడ్రస్, ఈ మెయిల్, ఫోన్ నంబర్ల వివరాలను ఆయా జిల్లాల సీఐడీ అధికారులకు పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. కొందరు తమ పేరు, వివరాలు గుర్తించలేరనే ఉద్దేశ్యంతో టెలిగ్రామ్, స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. ఐపీ అడ్రస్‌తో అసలు నిందితులెవరనేది పోలీసులు, నిఘా వర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేక పోతున్నారు. కేసుల్లో చిక్కిన తర్వాత తప్పు జరిగిందని, పొరపాటు జరిగిందని చెబుతున్నా చట్టం ప్రకారం శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..
అశ్లీల కంటెంట్ కు దూరంగా ఉండాలి
ఇంటర్నెట్ లో పిల్లల అశ్లీలతకు సంబంధించిన కంటెంట్‌ను చూసే వారి వివరాలన్నీ పోలీసులకు తెలుస్తాయి. ఆ విధమైన నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. దీని ద్వారా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అశ్లీలత కంటెంట్ కు దూరంగా ఉండాలి. ఇలాంటి కంటెంట్ ను ప్రోత్సహించవద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వై.వీ.ఎస్.సుధీంద్ర తెలిపారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు
చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడడం నేరమేనని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలు డౌన్లోడ్ చేయడం నేరమేనని తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. పోర్నోగ్రఫీ పరిభాషను మార్చాలని కేంద్రానికి సూచించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులుగా చైల్డ్ సెక్సువల్లీ అబ్యూసివ్ అండ్ ఎక్స్ ప్లాయిటేటివ్ మెటీరియల్స్ తో సవరించాల్సిన అంశాన్ని పార్లమెంట్ పరిగణించాలని సూచించింది.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్, కంప్యూటర్లు ఇస్తున్నారే తప్ప, వాటిలో వారు ఏం చేస్తున్నారో, చూస్తున్నారో గుర్తించడం లేదు. దీన్నే అలుసుగా చేసుకుంటున్న యువతరం అశ్లీల కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అశ్లీలతకు సంబంధించి మీ ఇంట్లో ఉండే ఇంటర్నెట్ కనెక్షన్‌కు ఉన్న ఐపీ అడ్రస్‌లో నిషేధిత వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని సైబర్ క్రైం పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.