శ్రీరామనవమికి చెర్రీ - సుకుమార్ మూవీ ఆరంభం!
ABN, Publish Date - Feb 11 , 2026 | 04:48 PM
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేన ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా ట్రీట్ ఉందట. చెర్రీ లైఫ్ లో స్పెషల్స్ చోటు చేసుకోవడంతో ఈ సారి పుట్టినరోజు మరింత ప్రత్యేకం అంటున్నారు. ఆ ముచ్చటేంటో మరి...!?
రామ్ చరణ్ (Ramcharan) బర్త్ డే ఆయన ఫ్యాన్స్ కు ఓ పండగ. మార్చి 27 వస్తోందంటే చాలు అనేక కేంద్రాలలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఆనందిస్తూంటారు చెర్రీ అభిమానులు. ఈ యేడాది చెర్రీ బర్త్ డేన ఆయన తాజా చిత్రం 'పెద్ది' (Peddi) రిలీజ్ అవుతుందని చాలా రోజులుగా వినిపిస్తూ వచ్చింది. దాంతో 'పెద్ది' రిలీజ్ కు థియేటర్స్ వద్ద సందడి డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్. చివరకు ఆ సినిమా ఏప్రిల్ 30వ తేదీని ఎంచుకుంది. దాంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. ఈలోగా చెర్రీకి జనవరి 31 తేదీన కవల పిల్లలు జన్మించడంతో మళ్ళీ ఫ్యాన్స్ లో జోష్ నిండింది. అందువల్ల ఈ సారి చెర్రీ బర్త్ డే వారికి మరింత స్పెషల్ గా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొనే చెర్రీ పుట్టినరోజయిన మార్చి 27న 'పెద్ది' సినిమా నుండి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ వెలుగు చూడనుందని తెలుస్తోంది. అలాగే చెర్రీ పుట్టినరోజుకు ముందు రోజయిన మార్చి 26న ఈ సారి శ్రీరామ నవమి పండగ వస్తోంది. ఆ రోజున చెర్రీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీని లాంఛనంగా ప్రారంభిస్తారని టాక్ !
గతంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' (Rangasthalam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. అందువల్ల చెర్రీ-సుక్కు కాంబో అనగానే మళ్ళీ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ చోటు చేసుకుంది. ఆ సినిమాను చెర్రీ బర్త్ డేన మొదలెట్టాలని భావించినా, ఓ రోజు ముందుగానే వస్తోన్న శ్రీరామనవమి పర్వదినాన ఆరంభిస్తారని తెలుస్తోంది. లేదా ఆ రోజున సుకుమార్ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ అయినా ఫ్యాన్స్ ముందు నిలుస్తుందనీ అంటున్నారు. ఎలా అనుకున్నా ఈ సారి శ్రీరామనవమికి చెర్రీ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా ట్రీట్ పక్కా అని తెలుస్తోంది.
చెర్రీతో గురుశిష్యుల సందడి!
ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ 'పెద్ది' మూవీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ముందు అనుకున్న తేదీ కంటే ఓ నెలరోజులు వెనక్కి వెళ్ళడంతో వారు నిరాశ చెందినా, చెర్రీ బర్త్ డే నుంచి 'పెద్ది' ప్రచారపర్వం మొదలు కానుంది. పైగా ఈ సినిమాను రూపొందిస్తోన్న దర్శకుడు బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం! అలాగే ఆ చిత్ర నిర్మాణంలోనూ సుకుమార్ పాలుపంచుకుంటున్నారు. ఇలా చెర్రీ రెండు సినిమాల్లోనూ సుకుమార్ పాత్ర ఉండడం కూడా ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తోంది. ఓ వైపు గురువు సినిమా ఆరంభం, మరోవైపు శిష్యుని చిత్రం ప్రచారం - ఇలా చెర్రీ బర్త్ డేని ఓ స్పెషల్ గా నిలిపారు సుకుమార్, బుచ్చిబాబు. ఫ్యాన్స్ కు రెట్టింపు ఉత్సాహం కలిగిస్తోన్న 'పెద్ది' వారికి ఎలాంటి ఆనందం పంచుతుందో చూడాలి.