సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చెన్నై లవ్ స్టోరీ నుండి గుర్తుందా పాట విడుదల

ABN, Publish Date - Mar 31 , 2026 | 11:10 AM

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటిస్తున్న చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్.కె.ఎన్., సాయి రాజేశ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమానుండి లిరికల్‌ వీడియో విడుదలైంది.

Chennai Love Story Movie

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి 'గుర్తుందా...' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, 'అహాన్ని మరచి ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం పనిచేశారు. ఎవరు ఏం చేసినా, ఏం చెప్పినా సినిమా కోసమే అనుకున్నారు. అందుకే ఈ మూవీ ప్రతి విషయంలో గెలుస్తుంది అని చెప్పగలను. ఈ సాంగ్ కోసం నేను పల్లవి రాశాక మణిశర్మ గారు సంగీతాన్ని అందించారు, చరణం మణిశర్మ గారు కంపోజ్ చేశాక నేను లిరిక్స్ రాశాను. ఎలాంటి ఈగో లేకుండా మేమంతా వర్క్ చేశాం' అని అన్నారు.


సాయి రాజేశ్ మాట్లాడుతూ, 'బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను. కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో మీరంతా చూస్తారు. ఈ సినిమా కొంత భాగం నేను చూశాను. సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. రవి అంత బాగా తెరకెక్కించాడు' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాట్లాడుతూ, 'సాయి రాజేశ్‌తో నాకు పరిచయం లేదు. ఆయన ఈ మూవీ కోసం వచ్చినప్పుడు 'బేబి' డైరెక్టర్ అని తెలిసింది. నాతో ఏం పని ఉంటుందని అనుకున్నా. ఆయన కలిసి చెన్నై లవ్ స్టోరీ మూవీకి మ్యూజిక్ చేయాలని అడిగారు. మూవీ కోసం డిస్కషన్స్ చేస్తూ బ్రహ్మాండమైన ట్యూన్స్ కుదిరాయి. పాటలు విని మీరు చెప్పాలి. కిరణ్‌తో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ, 'నేను ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నానంటే అందుకు కారణం ఎస్‌కేఎన్, సాయి రాజేశ్. ఏదో చిన్న సినిమా చేసుకుందాం అనుకున్నాను. నేను ఎమోషనల్ మూవీ చేయగలనా అనుకున్న నాతో ఇలాంటి మంచి మూవీ చేయిస్తూ నా ప్రతిభను వెలికితీస్తున్నారు. ఒక కొత్త దర్శకుడిని నిర్మాతలు ఇంతగా నమ్మడం నేను ఇప్పటిదాకా చూడలేదు. ఏ రోజు కూడా ఏం తీస్తున్నావు అని అడగలేదు. నేనే కంటెంట్ చూడమని వారిని పిలిచి అడుగుతుంటా. కిరణ్ అన్న ఎంతో సపోర్ట్ చేస్తూ నటిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతోంది. మణిశర్మ గారు మ్యూజిక్ చేసిన ఎన్నో మూవీస్ థియేటర్స్‌లో ఎంజాయ్ చేశా. ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ, 'గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ మీద చాలా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో కిరణ్ గారితో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఈ చిత్రం తర్వాత మరింత గొప్ప ఇమేజ్ తెచ్చుకుంటారు. ఈ మూవీలో ఇంత బరువైన, ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా' అని అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ, 'నిర్మాతగా సినిమాలు చేసేందుకు నేను ఎప్పుడూ తొందరపడలేదు. నా మనసుకు నచ్చిన కథ దొరికినప్పుడే సినిమాలు నిర్మించా. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిందీలో బేబి రీమేక్ స్టార్ట్ చేశాం. కొన్ని అవాంతరాలు వచ్చాయి. తెలుగులో సినిమా చేయాలి అనుకుంటున్న టైమ్‌లో సాయి రాజేశ్ గారు ఈ కథ చెప్పారు. బేబి లాంటి బిగ్ సక్సెస్ తర్వాత ఏ దర్శకుడైనా మరో పెద్ద ప్రొడక్షన్‌లోకి వెళ్లాలని అనుకుంటారు. కానీ నా చిన్ననాటి మిత్రుడు, నేను బెంజ్ కారు కొనుక్కునేలా చేసిన దర్శకుడు సాయి రాజేశ్ నాతోనే సినిమా చేస్తున్నారు. నా దర్శకులు మారుతి, సాయి రాజేశ్, రాహుల్ సంకృత్యన్, రవి నంబూరి.. ఇలాంటి వారి వల్లే నేను ఈ వేదిక మీద నిలబడ్డాను. రవి నాకు సోదరుడు. బేబి మూవీకి ఆయన చేసిన సపోర్ట్‌కు కృతజ్ఞతగా సాయి రాజేశ్.. రవికి ఈ మూవీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. తన కథల్ని మరో దర్శకుడికి ఇవ్వాలంటే సాయి రాజేశ్ చాలా ఆలోచిస్తారు. రవి ప్రతిభపై నమ్మకంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. రవికి రైటింగ్ మీద ఉన్న ప్రతిభ, సినిమాను రూపొందించడంలో ఉన్న కామన్ సెన్స్ మా అందరికీ నచ్చాయి. చెన్నై లవ్ స్టోరీలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అందరికీ అలాంటి ఎగ్జైట్ మెంట్ ఇస్తుంది. ఖర్చు ఎక్కువైనా మంచి క్వాలిటీ కోసం డాల్బీలో ఈ సినిమాను చేస్తున్నాం. ఈ విషయం చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ప్రోత్సహించారు. బేబి సినిమా టైమ్ లో నాకు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి నా సోదరుడు ధీరజ్. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్స్ కు వెళ్లి మీరు పెట్టే డబ్బులకు రెట్టింపు మనసును హత్తుకునే మూవీ అవుతుంది' అని అన్నారు.


హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'చెన్నై లవ్ స్టోరీ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎడిటర్ సంతోష్ ఒక్కో సీన్ కట్ చేసి చూపిస్తూ, మంచి సజెషన్స్ ఇస్తున్నాడు. అలాగే విశ్వాస్ డీవోపీగా నాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. మనవాళ్లు మనతో సినిమా చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మీద మరింత నమ్మకం కలుగుతుంటుంది. విజయ్ పొలాకీ మాస్టర్ నాతో మంచి కూల్ స్టెప్స్ చేయించాడు. అనంత శ్రీరామ్ గారు అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ గా రాశారు. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. రవి నంబూరితో రచయితగా రవి ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు. దర్శకుడిగా రవితో నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. ఎస్ కేఎన్ గారికి మూవీ అంటే చాలా ప్యాషన్. ఎప్పుడూ హిట్ సినిమా చేయాలనే మాట్లాడుతుంటారు తప్ప బడ్జెట్ ఎంత ఏంటి అని ఆలోచించరు. సాయి రాజేశ్ గారు ఉంటే మనం పూర్తి నమ్మకంతో ఉండొచ్చు అని అర్థమైంది. ఈ రోజు మా మూవీ ప్రమోషన్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్, సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మ గారు ఏడు పాటలు కంపోజ్ చేశారు. ఏడు పాటల్ని మీరు థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారు' అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్‌ మొగిలినేని, కొరియోగ్రాఫర్ విజయ్‌ పొలాకీ, ఎడిటర్ సంతోష్‌ నాయుడు, ఎడిటర్ విప్లవ్, నటుడు మహేందర్, డీవోపీ విశ్వాస్‌ డేనియల్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:12 AM