భాగమతి డైరెక్టర్ మోసం.. హీరో చేస్తానని నమ్మించి
ABN, Publish Date - Jul 10 , 2026 | 06:58 PM
టాలీవుడ్ డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు (Ashok Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్ల జమీందార్, సుకుమారుడు, భాగమతి లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపును అందుకున్నాడు.
టాలీవుడ్ డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు (Ashok Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్ల జమీందార్, సుకుమారుడు, భాగమతి లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపును అందుకున్నాడు. గతకొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అశోక్ బాబు ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికి, అతని తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు కేసు నమోదయ్యింది.
సినిమా ఇండస్ట్రీలో ఒక యువకుడిని హీరోగా లాంచ్ చేస్తామని.. దర్శకుడు అశోక్ బాబు.. నిర్మాత విజయలక్ష్మీ.. యువకుడి తల్లిదండ్రుల వద్ద రూ.3.5 కోట్లు తీసుకున్నారు. ఎంతకాలం అయినా యువకుడిని వెండితెరకు పరిచయం చేయకపోగా, తీసుకున్న భారీ మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వకుండా దర్శకుడు అశోక్ బాబు కాలయాపన చేస్తూ వచ్చాడు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం, అటు కెరీర్ పరంగా కూడా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకుడి తల్లిదండ్రులు చివరకు చట్టాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. సినిమా ఆఫర్ల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే మంచి పేరున్న అశోక్ బాబు ఇలా చేయడంతో ఇండస్ట్రీ షాక్ అవుతుంది.