Aadarsha Kutumbam: వెంకటేశ్- త్రివిక్రమ్.. ఆదర్శ కుటుంబం చెప్పిన టైంకి వచ్చేనా! ఎందుకంటే
ABN, Publish Date - Feb 01 , 2026 | 09:48 PM
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా చూడాలని వెంకీ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కలయికలో సినిమా చూడాలని వెంకీ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ కల నెరవేరుతోంది. తన కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్ రచయితగా వెంకటేశ్‌కు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాలేదు. ఆ నిరీక్షణకు ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం-AK 47' Aadarsha Kutumbam House No: 47 (AK 47)చిత్రంతో తెరపడింది. ఇటీవల అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రేజీ జోడీ సెట్స్ పైకి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొన్నప్పటికీ, నిర్మాణంలో జరుగుతున్న కొన్ని మార్పులు ఫ్యాన్స్‌ను ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే పనులు వేగంగా సాగుతున్నాయి. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ డ్రామాగా రూపొందిస్తూనే, క్రైమ్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించినట్లు సమాచారం. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో సాంకేతిక నిపుణుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత టెక్నికల్ టీమ్‌లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ముందుగా అనుకున్న సినిమాటోగ్రాఫర్ స్థానంలో మరొకరిని తీసుకున్నారట. అలాగే ఆర్ట్ డైరెక్టర్ విషయంలో కూడా మార్పు జరిగిందని తెలుస్తోంది.
తొలుత 'లక్కీ భాస్కర్' ఫేమ్ వినేష్ బంగ్లాన్ పర్యవేక్షణలో భారీ సెట్ నిర్మించినప్పటికీ, త్రివిక్రమ్ ఆ అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చి, కొత్త ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌ను రంగంలోకి దించారు. ఆయన పాత సెట్‌ను పూర్తిగా పునర్నిర్మించిన తర్వాతే చిత్రీకరణ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రధాన సెట్ పనులు ఇంకా కొనసాగుతుండటంతో, ఇతర ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేసే పనిలో చిత్ర బృందం నిమగ్నమైందని తెలుస్తోంది. ఈ జాప్యం వల్ల సమయం వృధా కాకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు కూడా ఒక హీరోయిన్‌తో ప్రత్యేకమైన ప్రేమకథ ఉంటుందని సమాచారం. టీమ్‌లో మార్పులు, జాప్యాలు జరుగుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ అనుకున్నట్లుగా వేసవి నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురాగలదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.