అప్పుడు.. 'రంగస్థలంలో గోదావరి యాస, 'పుష్ప' చిత్తూరు మాండలికం ఇప్పుడు 'భోగి కి తెలంగాణ యాస
ABN, Publish Date - Nov 22 , 2026 | 11:29 AM
శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ సినిమాలో పాటలన్నీ ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాశారు. స్వచ్ఛమైన తెలంగాణ మాండలికం, పల్లె పదాలు, భీమ్స్ సంగీతం, నాటు నాటు పాటకు పట్టిన సమయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
'నేను మా ఊళ్లో ఉన్నది 13ఏళ్లే. అప్పుడు మా పల్లెల్లో వాడుక భాషలో ఉన్న మాటలను గుర్తుచే సుకుని 'భోగి' పాటల్లో పెట్టా. నేను పాట రాస్తే నిరక్షరాస్యురాలైన మా అమ్మకు అర్థమవుతుందా? లేదా? అని ఆలోచిస్తా. నేను రాసే పదాలు నేరుగా శ్రోతలతో మాట్లాడుతున్నట్టుండాలి. నా భావాన్ని వాళ్ల మనసుల్లోకి మోయడానికి దళా రులుండకూడదని నమ్ముతా' అని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) అన్నారు. శర్వానంద్ హీరోగా
సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న భోగి (Bhogi Movie) సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. ఈ నెల 27న 'భోగి' విడుదలవుతున్న సందర్భంగా చంద్రబోస్ విలేకరులతో మాట్లాడారు. 'గతంలో 'మల్లేశం, ఛాంపియన్' సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. అయితే బోగిలో ఒకప్పటి స్వచ్ఛమైన తెలంగాణ పదాలతో పాట సాగుతాయి. నా మాతృయాసలో పాటలు రాసే పనిలో సఫలమయ్యాననే ఆత్మ సంతృప్తి ఉంది.
సినీ కవి ప్రతి మాండలికాన్ని పట్టుకోగలగాలి. 'రంగస్థలం' కోసం గోదావరి యాసను, 'పుష్ప' కోసం చిత్తూరు మాండలికాన్ని ఆకళింపు చేసుకున్నా' అని అన్నారు. సంపత్ నందికీ స్వతహాగా కవిత్వం అంటే ఇష్టం. 'భోగి'లో ప్రతి పదాన్ని, పాదాన్ని ఆస్వాదించాం. భీమ్స్ నా స్పూర్తితో సినిమా రంగానికి వచ్చానని చెబుతుంటాడు. ఈ సినిమాలో చాలా మంచి సంగీతాన్నిచ్చాడు. ప్రతి పాటా సందర్భోచితంగా సాగుతుంది' అని తెలిపారు. తన 31 ఏళ్ల సినీ కెరీర్లో అత్యధిక సమయం తీసుకుని రాసిన పాట 'నాటు నాటు' అని ఆయన అన్నారు.