55 ఏళ్ళ 'తాసిల్దార్ గారి అమ్మాయి'

ABN , Publish Date - Nov 12 , 2026 | 07:26 PM

నటభూషణ శోభన్ బాబు (Sobhan Babu)ను స్టార్ హీరోగా నిలిపిన చిత్రం 'తాసిల్దార్ గారి అమ్మాయి' ( Tahsildar Gari Ammayi). అంతకుముందు ఎన్నిచిత్రాల్లో కథానాయకునిగా నటించినా అవేవీ శోభన్ బాబుకు ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచలేక పోయాయి.

Tahsildar Gari Ammayi

నటభూషణ శోభన్ బాబు (Sobhan Babu)ను స్టార్ హీరోగా నిలిపిన చిత్రం 'తాసిల్దార్ గారి అమ్మాయి' ( Tahsildar Gari Ammayi). అంతకుముందు ఎన్నిచిత్రాల్లో కథానాయకునిగా నటించినా అవేవీ శోభన్ బాబుకు ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచలేక పోయాయి. 'తాసిల్దార్ గారి అమ్మాయి' లో శోభన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. రెండు పాత్రల్లోనూ శోభన్ బాబు కనబరచిన వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కావిలిపాటి విజయలక్ష్మి రాసిన 'విధివిన్యాసాలు' నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం 1971 నవంబర్ 12న విడుదలయింది.


కె.రాఘవేంద్రరావును స్టార్ డైరెక్టర్ గా నిలిపిన 'అడవిరాముడు' (1977) చిత్రాన్ని నిర్మించిన సత్యచిత్ర సంస్థకు తొలి చిత్రం 'తాసిల్దార్ గారి అమ్మాయి'. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు తండ్రి కె.యస్.ప్రకాశరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మించారు. 'కండక్టర్ కొడుకు కలెక్టర్ కావడమా?' అనే డైలాగ్ ఇందులో భలేగా ప్రాచుర్యం పొందింది. కథ విషయానికి వస్తే - బస్ కండక్టర్ ప్రసాద్ ను తాసిల్దార్ గారి అమ్మాయి మధుమతి ప్రేమించి పెళ్ళిచేసుకుంటుంది. తరువాత వారి మధ్య అంతస్థుల వ్యత్యాసం మొదలవుతుంది. భార్య, భర్త మధ్య వివాదంలో తన కొడుకును కలెక్టర్ ను చేస్తానని ప్రసాద్ శపథం చేస్తాడు. భర్తను వీడి అన్నల దగ్గర చేరిన మధుకు పలు అవమానాలు ఎదురవుతాయి. చివరకు ఆమె కొడుకు తండ్రిని వెదుక్కుంటూ వెళ్ళి అతని ఆర్థికసాయంతోనే కలెక్టర్ అవుతాడు. తన కన్నవారిని కలపడంతో కథను సుఖాంతం చేస్తాడు కలెక్టర్. ఈ కథను తెరపై ఆవిష్కరించిన తీరు అప్పట్లో కొత్తదనం సంతరించుకుంది. 'ఫ్లాష్ బ్యాక్స్'లో కథను నడుపుతూ కె.యస్.ప్రకాశరావు సమకూర్చిన స్క్రీన్ ప్లేను ఈ నాటికీ దర్శకులు ఎంతగానో ప్రశంసిస్తూ ఉంటారు.


కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు. "కనపడని చెయ్యేదో నడిపేది నాటకం..", "నీకున్నది నేనని- నాకున్నది నీవని...", "అల్లరి చేసే వయసుండాలి...", "జాగిరి జాగిరి జాగిరి...", "పాడమన్నావు పాడుతున్నాను..." వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇందులో తాసిల్దార్ గా నాగభూషణం నటించారు. ఆయన కూతురు పాత్రలో జమున, ఆమె మేనకోడలుగా చంద్రకళ అభినయించారు. రావి కొండలరావు, సాక్షి రంగారావు, రాధాకుమారి ఇతర ముఖ్యపాత్రధారులు. 'తాసిల్దార్ గారి అమ్మాయి' చిత్రం మంచి విజయం సాధించింది. శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా తరువాత శోభన్ బాబు సోలో హీరోగా నటించిన మరికొన్ని చిత్రాలు సక్సెస్ రూటులో సాగడం ఆరంభించాయి.

Updated Date - Nov 12 , 2026 | 07:26 PM