టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం.. కేసు నమోదు
ABN, Publish Date - Aug 24 , 2026 | 10:08 AM
భారీ జనసందోహం మధ్య మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
‘టాక్సిక్ (Toxic) సినిమా ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటూ సంచలనం సృష్టిస్తుంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, మద్దతును ఈ చిత్రంతో తిరిగి ఇస్తాను’ అని యశ్ (Yash) అన్నారు. ఆయన కథానాయకుడిగా గీతూ మోహన్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. కే వెంకట్ నారాయణ్, యశ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ నెల 26న ‘టాక్సిక్’ విడుదలవుతోన్న సందర్భంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Malla Reddy University)లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీఎన్ మాట్లాడుతూ ‘భారతీయ సినిమాను ప్రపంచవేదికపై నిలబెట్టాలని చూసే నటుల్లో యశ్ ఒకరు’ అని చెప్పారు. ‘సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా ఈ సినిమా రూ 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది’ అని నాతో అన్నారు’ అని దిల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం.. కేసు నమోదు
భారీ జనసందోహం మధ్య మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం జరిగింది. వేదిక సమీపంలో క్లియర్ వ్యూ కోసం కొందరు అభిమానులు, విద్యార్థులు ఫ్లడ్‌లైట్ స్తంభాలు, సౌండ్ బాక్స్‌లు అమర్చిన ఐరన్ పోల్స్‌పైకి ఎక్కగా.. బరువు ఎక్కువై ఓ పోల్ పక్కకు ఒరిగింది. యశ్ ప్రసంగం చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఆయన వెంటనే స్పందించి ‘అందరూ క్షేమంగానే ఉన్నారా. ఏమైందో చూడండి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా పోల్స్ ఎక్కిన వారు వెంటనే దిగేయాలని కోరారు. ఇందులో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చారు. ఆ విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.