పాన్ ఇండియా అంటున్న సీనియర్స్.. 'మాకు నమ్మకం లేదు దొరా' అంటున్న ఫ్యాన్స్
ABN, Publish Date - Mar 05 , 2026 | 03:11 PM
తెలుగు సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లకు పాన్ ఇండియా సినిమాలు ఇంతవరకూ అచ్చిరాలేదు. మరి నాగార్జున్ ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను తన వందవ చిత్రంతో అధిగమిస్తారో లేదో చూడాలి.
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ అంటే ఫ్యాన్స్‌కు డౌట్ కొడుతోంది. ఓ టాప్ స్టార్ మైల్ స్టోన్ సినిమాపై అప్పుడే చర్చ మొదలయింది. ఆ చిత్రం 'పాన్ ఇండియా పిక్చర్'గా వస్తే ఎలా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయట.
కింగ్ నాగార్జున (Nagarjuna) తన వందో చిత్రంతో అభిమానగణాలకు ఆనందం పంచాలని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ రా కార్తిక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'లాటరీ కింగ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా 'పాన్ ఇండియా మూవీ'గా తెలుగుతో పాటు ఇతర దక్షిణాది మూడు భాషల్లోనూ ఉత్తరాన హిందీలోనూ విడుదలవుతోందని తెలుస్తోంది. ఇక్కడే సినీ ఫ్యాన్స్‌లో కొన్ని అనుమానాలు పొడసూపుతున్నాయి. ఇప్పటి వరకూ టాలీవుడ్ సీనియర్ స్టార్స్ ఎవ్వరికీ 'పాన్ ఇండియా మూవీస్' అచ్చిరాలేదని గుర్తు చేసుకుంటున్నారు.
నటసింహ బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌లో తొలి పాన్ ఇండియా పిక్చర్‌గా రిలీజైన 'అఖండ-2' (Akhanda 2) సినిమా ఆదిలోనే ప్రకటించిన తేదీకి విడుదల కాలేక పోయింది. వారం ఆలస్యంగా జనం ముందు నిలచినా, భారీ ఓపెనింగ్స్ రాబట్టినా, 'అఖండ-2' అట్టే ఆకట్టుకోలేక పోయింది అన్నది నిర్వివాదాంశం. పైగా బాలకృష్ణకు బాగా అచ్చివచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే ఈ చిత్రం తెరకెక్కింది. అయినా, మ్యాజిక్ సాగలేక పోయింది అని సినీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
'అఖండ-2' కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన తొలి చారిత్రక నేపథ్య చిత్రం 'సైరా... నరసింహారెడ్డి' కూడా పాన్ ఇండియా సినిమాగానే రిలీజయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ సినిమా హీరో కిచ్చా సుదీప్, భోజ్ పురి నటుడు రవి కిషన్ తదితరులు నటించారు. అత్యంత భారీగా ఈ సినిమాను చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ డ్రామా హిట్టు బాట పట్టలేక పోయింది. ఆ తరువాత చిరంజీవి నటించిన ఏ చిత్రమూ పాన్ ఇండియా మూవీగా రాలేదు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటించిన 'సైంధవ్' కూడా పాన్ ఇండియా మూవీ అని తొలుత ప్రకటించారు. అయితే ఈ సినిమా ముందుగా ప్రకటించిన అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ కాలేక పోయింది. అలా ఆరంభంలోనే 'సైంధవ్'కు ఎదురుదెబ్బ తగిలింది. శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'సైంధవ్' ఏ మాత్రం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఇలా ఇప్పటికే ముగ్గురు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తమ పాన్ ఇండియా మూవీస్‌తో చేదు అనుభవాన్ని చవిచూశారు.
గత సంవత్సరం నాగార్జున నటించిన 'కుబేర', 'కూలీ' చిత్రాలు పాన్ ఇండియా పిక్చర్స్‌గానే రిలీజయినా అవీ ఆశించిన స్థాయిలో అలరించలేదనే చెప్పాలి. ఆ రెండు చిత్రాల్లోనూ నాగ్ హీరో కాకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలోనే నాగార్జున నూరవ చిత్రంగా వచ్చే 'లాటరీ కింగ్' ఆల్ ఇండియా లెవెల్లో రిలీజయితే ఏ తీరున మురిపిస్తుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి నాగ్ కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాగా రానున్న 'లాటరీ కింగ్' బాక్సాఫీస్ వద్ద టైటిల్ కు తగ్గట్టుగా లాటరీ కొట్టేస్తుందేమో చూడాలి.