SAHAA: బన్నీ వాస్.. నుంచి మరో ప్రేమ కావ్యం! సహ ట్రైలర్‌లో.. ఏదో మ్యాటర్ ఉందే
ABN, Publish Date - Aug 27 , 2026 | 08:05 PM
యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ‘సహ - లైఫ్ ఆఫ్ సంజు’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ‘సహ - లైఫ్ ఆఫ్ సంజు’ (SAHAA Life of Sanju) నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. సుమైరా స్టూడియోస్ సమర్పణలో తేజ వేల్పుచర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిశాంత్ దోటి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ప్రేమ, విరహం, జీవిత జ్ఞాపకాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్‌లో ఒక యువకుడి జీవితాన్ని ప్రేమ ఎలా మార్చింది? ఆ ప్రేమ జ్ఞాపకాలు అతని జీవిత ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అనుకోకుండా మొదలైన పరిచయం ప్రేమగా మారడం, ఆ బంధం జీవితంలో మధుర క్షణాలను నింపడం, ఆ తర్వాత పరిస్థితుల కారణంగా విడిపోవడం వంటి భావోద్వేగ అంశాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రేమలోని ఆనంద క్షణాలు, విడిపోవడం వల్ల కలిగే బాధ, గతాన్ని మరచిపోలేని మనసు మధ్య జరిగే సంఘర్షణను ట్రైలర్‌లో చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. అదే సమయంలో వినోదానికి కూడా చోటు కల్పిస్తూ కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్యా కీలక పాత్రలు పోషించారు. పాత్రల మధ్య కెమిస్ట్రీ, సహజమైన భావోద్వేగాలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా శేఖర్ చంద్ర అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని భావాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తున్నాయి. ప్రేమ అనేది కేవలం ఇద్దరి మధ్య జరిగే కథ మాత్రమే కాదని, అది జీవితాంతం వెంటాడే జ్ఞాపకాల సమాహారమని చెప్పే ప్రయత్నం ‘సహ - లైఫ్ ఆఫ్ సంజు’లో కనిపిస్తోంది. భావోద్వేగాలు, ప్రేమ, వినోదం కలగలిపిన ఈ చిత్రం యువతను ఎంతవరకు ఆకట్టుకుంటుందో సెప్టెంబర్ 4న తెలియనుంది.