Buchi Babu: పెద్ది సన్నివేశాల్లో మార్పు.. దర్శకుడి వివరణ.

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:24 AM

‘పెద్ది’ (Peddi) సినిమాలో అచ్చియమ్మ పాత్రపై వస్తున్న విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సాన స్పందించారు.

‘పెద్ది’ (Peddi) సినిమాలో అచ్చియమ్మ పాత్రపై వస్తున్న విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సాన స్పందించారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని తెలిపారు. ఆయన దర్శకుడిగా రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ నటించారు. అచ్చియమ్మ (Janhvey kapoor) పాత్రను చూపించిన విధానం కరెక్ట్‌గా లేదని, కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్న తరుణంలో బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. సారీ చెబుతూ ఓ నోట్‌ విడుదల చేశారు.

‘ఒక దర్శకుడిగా.. సినిమా అనేది ప్రేక్షకుల్ని అలరించాలి, స్ఫూర్తిని నింపాలి, మంచి జ్ఞాపకంగా మిగలాలి అని ఆలోచిస్తుంటాను. సినిమాతో ఎవరినీ ఇబ్బందికి పెట్టకూడదు. అసౌకర్యానికి కలిగించకూడదు.. అగౌరవ పరచకూడదు. ఇదే ఆలోచన నా మైండ్‌లో ఉంటుంది. అయితే పెద్ది సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌పై కొన్ని విమర్శలు మా దృష్టికి వచ్చాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్నాము. తెరపైన, తెర వెనుక కూడా మహిళలంటే నాకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలో సన్నివేశాలు మీ మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. కొన్ని సీన్ల విషయంలో సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులను గమనించి సంబంధిత సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రేక్షకుల ఆదరణతోనే సినిమా ముందుకు వెళ్తుంది. సక్సెస్‌ అవుతుంది. ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని స్టోరీ రాసుకోవలసిన బాధ్యత మాపై ఉంది, కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలి. ప్రతి మహిళాలకు గౌరవం ఇవ్వాలి. అందుకువాఆరు అర్హులు. వారిని శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేం కట్టుబడి ఉన్నాం. ‘పెద్ది’ విషయంలో తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా, నిజయతీగా చెప్పిన అందరికీ ధన్యవాదాలు’ అని బుచ్చిబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీఽశ్‌ కిలారు నిర్మించారు. ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్‌ షోలు, తొలి కలెక్షన్లు కలిపి రూ.135 కోట్లు వసూళ్లు రాబట్టింది.

ALSO READ: ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!
పవన్ కళ్యాణ్‌తో ‘జీసస్‌’ అనుకున్నప్పుడే ‘సింగ్ గీతం’ కథ సిద్ధమైంది: దేవిశ్రీ

Shivanna: శివ రాజ్ కుమార్‌ - అభిషన్‌ ప్రధాన పాత్రల్లో కొత్త చిత్రం


Updated Date - Jun 06 , 2026 | 11:25 AM