Biopic Boom:బయోపిక్‌ల హవా.. తెరపైకి వస్తున్న సంచలన జీవితగాథలు!
ABN, Publish Date - Aug 23 , 2026 | 11:24 AM
వార్తల్లో ఉన్న వ్యక్తి గురించో, వార్తలకెక్కని ఒక అన్‌సంగ్ హీరో జీవితగాథనో తెరపై బయోపిక్‌గా చూడటం ఎప్పుడూ ఆసక్తికరమే. వాళ్లు వ్యాపారస్తులు, మాఫియా డాన్‌లు, కళాకారులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, సైనికులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. సాధారణంగా సినీరంగంలో ఏదైనా జానర్‌లో ఒక సినిమా హిట్టయితే... అదే కోవలో ఒక ట్రెండ్ కొనసాగుతుంది.
వార్తల్లో ఉన్న వ్యక్తి గురించో, వార్తలకెక్కని ఒక అన్‌సంగ్ హీరో జీవితగాథనో తెరపై బయోపిక్‌గా చూడటం ఎప్పుడూ ఆసక్తికరమే. వాళ్లు వ్యాపారస్తులు, మాఫియా డాన్‌లు, కళాకారులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, శాస్త్రవేత్తలు, సైనికులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. సాధారణంగా సినీరంగంలో ఏదైనా జానర్‌లో ఒక సినిమా హిట్టయితే... అదే కోవలో ఒక ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ఏడాది ‘బయోపిక్’ల (IBiopic) హవా కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదల కాగా... డజనుకు పైగా బయోపిక్‌లు సిద్ధమవుతున్నాయి. ఆసక్తిరేపుతున్న అలాంటి ‘జీవితచిత్రాల’ విశేషాలే.. ఈ వారం కవర్‌స్టోరీ...
విథాబాయి బావూ మాంగ్ నారాయణ్ గోవాంకర్ అంటే చాలామందికి అంతగా తెలియకపోవచ్చు... ఆ పేరు కూడా ఎప్పుడూ వినలేదే అంటారెవరైనా. మహారాష్ట్రలో మాత్రం స్టేజీపైకి ఆమె గజ్జె కట్టుకుని వచ్చిందంటే ప్రేక్షకులు ఉర్రూతలూగేవాళ్లు. ‘విథాబాయి... విథాబాయి’ అంటూ... ఆమె ఆటాపాటలకు ఆబాలగోపాలం ఆనంద పారవశ్యంలో మునిగి తేలేది. ఆమెను ఒక ‘తమాషా’ కళాకారిణిగా మాత్రమే కాదు... ‘తమాషా రాణి’గా చెప్పుకొనేవారు. రిథమిక్‌గా అత్యంత జోష్‌తో సాగే ‘లావనీ’ నృత్యంలో దిట్ట. ఆ కళాకారిణి గొప్పదనం ఏమిటంటే... ఒక ప్రదర్శన జరుగుతుండగా విథాబాయికి ఊహించని విధంగా ప్రసవ వేదన మొదలయ్యింది. వేదిక వెనుకకు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి, ఒక రాయితో బొడ్డు తాడును స్వయంగా కోసుకున్న తర్వాత... కొంతసేపటికి వేదికపైకి వచ్చి ప్రదర్శన కొనసాగించిన ధీశాలి. అందుకే విథాబాయి కథను బాలీవుడ్‌లో బయోపిక్‌గా తీశారు. అదే ‘ఈథా’. విథాబాయి మరణించిన 24 ఏళ్లకు ఆమె జీవితగాథ తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ విథాబాయిగా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్‌లో పై సన్నివేశాన్ని చూసిన ప్రేక్షకులు ఆమె బయోపిక్‌పై ఆసక్తిని పెంచుకున్నారు. ఆ నృత్యకారిణి జీవితకథను తెలుసుకోవాలనే కుతూహలాన్ని చూపుతున్నారు.
ప్రముఖ మరాఠీ, హిందీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్... ఈ మరాఠీ నృత్యకారిణి బయోపిక్‌ను ‘ఈథా’గా తెరకెక్కించారు. బాలీవుడ్‌లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘డియర్ జిందగీ’ వంటి ఉత్తమ చిత్రాలను తీసిన ఉటేకర్ ఈసారి తన మాతృభాషకే చెందిన ఆణిముత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ బాలీవుడ్ బయోగ్రాఫికల్ సినిమా విడుదలకు సిద్ధమైంది.
‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’...
విథాబాయిలాగే... గోపాలస్వామి దొరైస్వామి నాయుడు ఉరఫ్ జీడీ నాయుడు అంటే కూడా ఈ తరానికి పెద్దగా ఎవరికీ తెలియదు... కోయంబత్తూరు వాసులకు తప్ప. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న కలంగల్‌లో 1893లో జన్మించిన జీడీ నాయుడు (జీడీఎన్) గొప్ప ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త, విద్యావేత్త కూడా. ఆయనను అంతా ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు ఆ కాలంలోనే. 1921లో ఒక బస్సుతో మొదలైన ఆయన ప్రయాణం... తొమ్మిదేళ్ల కాలంలోనే యూనివర్సల్ మోటార్ సర్వీస్ ద్వారా 600 బస్సులకు చేరింది. అందుకే ఆయన విజయ యాత్రను బయోపిక్‌గా దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ తమిళంలో ‘జీడీఎన్’గా తెరకెక్కించాడు. బయోపిక్ స్పెషలిస్ట్ నటుడు మాధవన్ టైటిల్ రోల్ చేశారు. ఈ సినిమాకు మాధవన్ స్ర్కీన్‌ప్లే కూడా చేయడం విశేషం. సత్యరాజ్, జయరామ్, ప్రియమణి వంటి అగ్రశ్రేణి నటీనటులు ఈ బయోపిక్‌కు జీవం పోశారు. అధిక మొత్తంలో పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖతో జీడీ నాయుడు సాగిస్తున్న పోరాటం (1950) నేపథ్యంలో... కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. జీడీఎన్ టీనేజీ నుంచి మొదలయ్యే కథ ఆయన ఎదుగుదలపై ఆసక్తిని పెంచుతుంది. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, స్వాతంత్ర్యానంతరం పన్ను అధికారులతో జరిపిన పోరాటం మిగిలిన కథకు ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. కథానుసారంగా, ఆయా కాలాలను సూచిస్తూ అడాల్ఫ్ హిట్లర్, ఎం.ఆర్.రాధ, ఎన్.ఎస్.కృష్ణన్ వంటి వారు కూడా సినిమాలో కనిపిస్తారు.
‘వైట్’ గురు...
ప్రముఖ భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ జీవితకథను కూడా సినిమాగా రూపొందిస్తుండటం విశేషం. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ పేరిట ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన శ్వేతవర్ణపు దుస్తులు ధరించే రవిశంకర్‌పై ‘వైట్’ పేరిట బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు ఈ ఆధ్యాత్మిక గురు ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆయన పాత్రలో వెబ్ సిరీస్‌ల ద్వారా పేరు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మాస్సే కనిపించనున్నారు. అంతర్జాతీయంగా ఫిల్మ్‌మేకర్‌గా పేరున్న ప్రముఖ యాడ్ మేకర్ మోంటూ బస్సీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్‌లో తీస్తున్న ‘వైట్’ 21 భాషల్లోకి అనువాదం కానుంది. ఈ యేడాదే విడుదలకు సిద్ధం అవుతోంది.
సినిమా లెజెండ్ కాలంలోకి...
భారతీయ సినిమా లెజెండ్స్‌లో ఒకరు శాంతారామ్ రాజారామ్ వాంకుడ్రే ఉరఫ్ వి.శాంతారామ్. ‘డాక్టర్ కొట్నిస్ కీ అమర్ కహానీ’ (1946), ‘అమర్ భూపాలీ’ (1951), ‘జనక్ జనక్ పాయల్ బాజే’ (1955), ‘దో ఆంఖే బారా హాత్’ (1957), ‘నవరంగ్’ (1959) ‘పింజారా’ (1972) వంటి క్లాసిక్స్‌తో అజరామరంగా నిలిచిన ఆయన జీవితాన్ని ‘వి.శాంతారామ్’గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే. మూకీ చిత్రాల కాలం నుంచి రంగులమయంగా మారిన సినిమాకు అంటే సుమారు ఏడు దశాబ్దాల ఆయన ప్రయాణాన్ని ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కూడా అందుకున్న శాంతారామ్‌గా తెరపై యువనటుడు సిద్ధాంత్ చతుర్వేది నటించడం ఆసక్తికరం. తమన్నా భాటియా ఒక కీలక పాత్ర చేస్తోంది.
‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
జీవితకథల ఆధారంగా సినిమాలు తీయడంలో 44 ఏళ్ల బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ముందువరుసలో ఉంటారు. పదేళ్ల క్రితమే ఆయన బాలగంగాధర్ తిలక్ జీవితాన్ని మరాఠీలో తెరకెక్కించారు. ఆయన తీసిన ‘లోక్‌మాన్య: ఏక్ యుగ్‌పురుష్’లో టైటిల్‌రోల్‌ను మరాఠీ నటుడు శుభోద్ బావే పోషించారు. ఈ సినిమాకు మహారాష్ట్ర స్టేట్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మరాఠా వారియర్ ‘తానాజీ’ బయోపిక్‌ను అజయ్‌దేవగన్‌తో తెరకెక్కించి జాతీయస్థాయిలో ఉత్తమ పాపులర్ సినిమా అవార్డు అందుకున్నారు. ఇక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ (ఇది బయోపిక్ కాదు) తీసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందులో ‘ఇన్‌స్పెక్టర్ జెండే’గా మనోజ్ బాజ్‌పాయ్ నటించాడు. ఈ నేపథ్యం ఉన్న ఓం రౌత్ దృష్టి తాజాగా ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన అబ్దుల్ కలామ్ జీవితకథపై పడింది. కలామ్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను ఆయన ఈ సినిమాలో చూపించనున్నారు. కలామ్ పాత్రను తమిళహీరో ధనుష్ చేస్తుండటం విశేషం. గత ఏడాది కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఓం రౌత్ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీరంగంలో ఆసక్తి నెలకొంది.
రాజ్‌కుమార్ రావ్ మరోసారి...
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ దియోరావ్ నికమ్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అత్యంత కీలకమైన హత్యకేసులు, ఉగ్రవాద కేసులను ఆయన వాదించారు. 1993 ముంబయ్ పేలుళ్ల కేసు, టీ సిరీస్ అధినేత గుల్షన్‌కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసు, 2008 ముంబయ్ అటాక్స్‌లతో పాటు అనేక గ్యాంగ్ రేప్స్ ఇతరత్రా కేసులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సమర్ధవంతంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు అవినాష్ అరుణ్ ‘ప్రహార్ - ది ఉజ్వల్ నికమ్ స్టోరీ’ అనే బయోగ్రాఫికల్ లీగల్ డ్రామాను తీస్తున్నారు. ఇందులో ఉజ్వల్ నికమ్‌గా రాజ్‌కుమార్ రావ్ చేయడం విశేషం. ఆయన ఇంతకుముందు (2024) చూపు లేకున్నా గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’లో టైటిల్ రోల్ చేసి ‘ఐఫా’ ఉత్తమనటుడిగా (క్రిటిక్స్) అవార్డు అందుకున్నారు.
రెండో మహిళా క్రికెటర్
భారతీయ క్రికెటర్లు కపిల్, ధోనీల బయోపిక్‌లు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో ఈసారి మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో ఉన్న చక్‌దాహ పట్టణంలో... ఒక మధ్యతరగతికి చెందిన గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపించే స్థాయికి ఎలా చేరుకుందనేది ఎంతైనా ఆసక్తికరమే. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2007 అవార్డుతో పాటు... భారతీయ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలందించింది. ఆమె బయోపిక్ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ గా వస్తోంది. ప్రోసిత్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గోస్వామిగా అనుష్కశర్మ తెర మీద క్రికెటర్ మెరుపులు మెరిపించనుంది. గతంలో మిథాలీరాజ్ బయోపిక్ ఆధారంగా ‘శభాష్ మిథు’ (తాప్సీ పొన్ను) వస్తే... తెరకెక్కుతోన్న రెండో మహిళ క్రికెటర్ బయోపిక్ ఇదే.
పుస్తకం ఆధారంగా....
‘లెట్ మీ సే ఇట్ నౌ’... ఒకప్పటి ముంబయ్ పోలీస్ కమిషనర్ రాకేశ్ మరియా రాసిన జ్ఞాపకాల పుస్తకం. ఈ పుస్తకం ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ‘మరియా ఐపీఎస్’ అనే బయోగ్రాఫికల్ యాక్షన్ సినిమా తీస్తున్నారు. ముంబయ్‌లో జరిగిన అనేక సంఘటనలకు మరియా ప్రత్యక్షసాక్షిగా ఉన్నారు. ఆయనే పలు కేసులను పకడ్బందీగా డీల్ చేశారు. వాటిలో 1993లో ముంబయ్‌లో జరిగిన వరుస పేలుళ్లు, 26 బై 11 టెర్రరిస్ట్ అటాక్స్ లాంటివి ఉన్నాయి. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జాన్ అబ్రహాం ‘మరియా ఐపీఎస్’గా రంగంలోకి దిగారు. ఆయన భార్య ప్రీతి మరియాగా తమన్నా భాటియా కనిపించనుంది.
సంగీతజ్ఞాని
భారతీయ సినీ సంగీతంలో మాస్ట్రో ఇళయరాజాది ప్రత్యేకమైన స్థానం. ముఖ్యంగా ఎన్నో దక్షిణాది సినిమా పాటలకు ఆయన ప్రాణం పోశారు. సంగీతంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన సంగీత ప్రయాణానికి తెర రూపం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. ‘రాకీ’, ‘కెప్టెన్ మిల్లర్’ తాజాగా ‘డీసీ’తో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ తమిళ దర్శకుడు ఏకంగా సంగీతజ్ఞాని ‘ఇళయరాజా’ పేరుతో ఆయన బయోపిక్‌ను తీసేందుకు సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇళయరాజాగా ధనుష్ నటించడం. ఈ సినిమాకు ఇళయరాజానే స్వయంగా సంగీతాన్ని అందిస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. నిజానికి రెండేళ్ల క్రితమే ఆర్భాటంగా సినిమా ప్రారంభోత్సవం చేసినప్పటికీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈమధ్య ఈ బయోపిక్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.
వీటితో పాటు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ బయోపిక్‌ను గుజరాతీలో ‘మ్యాన్ ఆఫ్ స్టీల్: సర్దార్’గా తీస్తున్నారు. అదేవిధంగా గత ఏడాది సెప్టెంబర్ 15న భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బయోపిక్‌ను ‘మా వందే’గా తీస్తున్నట్లు ప్రకటించారు. మలయాళ నటుడు ఉన్నిముకుందన్‌ను దర్శకుడు క్రాంతికుమార్ ప్రధాని మోదీ పాత్ర కోసం ఎంచుకున్నారు. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ‘బండిట్ శకుంతల’, ‘మధుబాల’... ఈ బయోపిక్ లిస్ట్ చాలానే ఉంది.
తెలుగులో కనిపించవు...
బయోపిక్ జానర్‌కు తెలుగు సినిమా దాదాపుగా దూరంగా ఉంటోందనే చెప్పాలి. అలాంటి కథలవైపు మన దర్శకులు సీరియస్‌గా దృష్టిసారించడం లేదు. ఎందుకంటే చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకుంటుంది. అప్పుడెప్పుడో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ తీసి మెప్పించారు. అడపాదడపా కొన్ని ప్రయత్నాలు (రఘుపతి వెంకయ్యనాయుడు, గుమ్మడి నర్సయ్య) జరిగినప్పటికీ... వాటి గురించి పట్టించుకున్నవారు లేరు. ఒకరకంగా బయోపిక్ తీయదగిన వ్యక్తులను గుర్తించడంలో కూడా మనవాళ్లు వెనకబడి ఉన్నారు. అంతెందుకు... హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మైదాన్’ (అజయ్‌దేవగన్ హీరో), ఆంధ్రప్రదేశ్‌లో అంధుడైన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌గా తీసిన ‘శ్రీకాంత్’ (రాజ్‌కుమార్ రావ్ హీరో) చిత్రాలను కూడా బాలీవుడ్ దర్శకులు పిక్ చేస్తేగానీ వారి గొప్పదనం ఏమిటనేది మనకు తెలియలేదు.
నిజానికి భారతీయ సినీరంగంలో బయోపిక్‌లు కొత్తేం కాదు... అయితే గత కొంతకాలంగా.. స్ఫూర్తినిచ్చిన, వార్తల్లో నిలిచినవారి బయోపిక్‌లతో పాటు.. ‘అన్‌సంగ్ హీరోల’ కథలను కూడా వెదికి మరీ పట్టుకుంటున్నారు. అయితే వీటిని దర్శకులు ఎంచుకోవడానికి మాత్రం రకరకాల కారణాలుంటున్నాయి. కొన్ని వారి జీవితాలను చక్కగా ఆవిష్కరిస్తుంటే, మరికొన్ని ఒకే కోణంలో రాజకీయ ప్రేరేపితంగా ఉంటున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఇవన్నీ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి. అందుకే దర్శకులు బయో‘పిక్’ చేస్తున్నారు.
- చల్లా శ్రీనివాస్