మాళవిక నాయర్: మొదటి హీరోతో.. హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాల్లో
ABN, Publish Date - Mar 29 , 2026 | 09:46 AM
మాళవికా నాయర్... ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. తనదైన నటనతో పాత్రకు సహజత్వం తీసుకొస్తుంది. తెలుగులో చాలా విరామం తర్వాత ‘బైకర్’లో శర్వానంద్‌తో జత కట్టింది.
మాళవికా నాయర్ (Malavika Nair)... ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. తనదైన నటనతో పాత్రకు సహజత్వం తీసుకొస్తుంది. తెలుగులో చాలా విరామం తర్వాత ‘బైకర్’లో (biker) శర్వానంద్‌తో జత కట్టింది. ఈ సందర్భంగా తన కథానాయకుల గురించి అడిగితే ‘ఎవరి ప్రత్యేకత వారిదే’ అంటూ ఇలా చెప్పుకొచ్చింది...
విజయ్ గురించే అడిగేవారు...
నేను రెండుసార్లు తెరను పంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. మేమిద్దరం మొదటిసారి ‘ఎవడే సుబ్రమణ్యం’లో ఆ తర్వాత ‘టాక్సీవాలా’లో నటించాం. ఆ సమయంలో నా క్లాస్‌మేట్స్, స్నేహితులు తరచూ విజయ్ గురించే అడిగేవారు. ‘విజయ్ ఎలా ఉన్నాడు? తన తదుపరి సినిమా ఏంటి?’ అని నాపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. నాకు బాగా గుర్తు... ‘ఎవడే సుబ్రమణ్యం’ షూట్ గ్యాప్‌లో ‘‘ఒకవేళ ఈ సినిమా సరిగ్గా ఆడకపోతే, నటన మానేసి దర్శకత్వం వైపు వెళ్తా’ అన్నాడు.
నా మొదటి హీరో
తెలుగులో నా మొదటి హీరో నాని. ‘ఎవడే సుబ్రమణ్యం’ కోసం హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో షూట్ చేశాం. ఆ సమయంలో నాతోపాటు, టీమ్‌లో కొంతమందికి ఆక్సిజన్ అందక కళ్లు తిరిగేవి. ‘మనం ఒక మంచి సినిమా చేస్తున్నాం. ఈ కష్టం రేపు ప్రతిఫలాన్ని ఇస్తుంది’ అని నాని మమ్మల్ని ప్రోత్సహించేవారు. మాలో ఉత్సాహం నింపడానికి జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉండేవారు. షూటింగ్ అయిపోయాక ఓరోజు అతడికి ఫోన్ చేసి షూటింగ్ జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకున్నా.
దుల్కర్ నటనకు ఫిదా...
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. దుల్కర్ సల్మాన్ రెండో చిత్రం ‘ఉస్తాద్ హోటల్’లో నేను ఒక చిన్న పాత్ర చేశాను. అప్పుడు నాకు కెమెరా ముందు నిలబడాలంటేనే వణుకు వచ్చేది. ఆ సమయంలో దుల్కర్ నా దగ్గరకొచ్చి, ‘పర్వాలేదు, రిలాక్స్ అవ్వు’ అని ధైర్యం చెప్పారు. కట్‌చేస్తే.. ‘మహానటి’లో అతడి భార్యగా నటించా. దుల్కర్‌లో ఏదో తెలియని చార్మ్ ఉంటుంది. అతడు కళ్లతోనే ఎవరినైనా ఆకట్టుకుంటారు. జెమినీ గణేశన్ పాత్రలో ఒదిగిన తీరు చూసి అతడి నటనకు ఫిదా అయిపోయా.
చైతూ... సో స్వీట్!
నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’లో నటించా. అతడు నిజంగా జెంటిల్‌మ్యాన్. చిరునవ్వుతో అందరినీ గౌరవిస్తూ పలకరిస్తారు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా అతడిలో రవ్వంత కూడా గర్వం ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటారు. అందర్నీ ఒకేలా చూస్తారు. క్రమశిక్షణ ఎక్కువ. సీన్ ఏదైనా సరే, చాలా శ్రద్ధగా పూర్తి చేస్తారు. సెట్స్‌కి టైమ్‌కి రావడం, తన పని తాను చూసుకోవడం... ఇవన్నీ అతడిని చూసే నేర్చుకున్నా.
నా క్రైమ్ పార్ట్‌నర్
సంతోష్ శోభన్ నాలాగే అల్లరోడు. మేమిద్దరం షూట్ (‘అన్నీ మంచి శకునములే’) గ్యాప్‌లో అందర్నీ ఆటపట్టిస్తూ, జోకులు వేస్తూ.. సెట్‌ను సందడిగా ఉంచేవాళ్లం. మా ఇద్దరి ఆలోచనలు, చేసేపనులు చాలావరకు ఒకేలా ఉండేవి. అందుకే మమ్మల్ని టీమ్ అంతా సరదాగా ‘క్రైమ్ పార్ట్‌నర్స్’ అనేవారు. సంతోష్ సహజ నటుడు. అతడితో కలిసి నటిస్తున్నప్పుడు విడిగా ఏమీ కష్టపడక్కర్లేదు. అతడు ఇచ్చే రియాక్షన్స్‌కి రియాక్ట్ అయితే చాలు... ఆటోమేటిక్‌గా సీన్ పండుతుంది. అతడి నటనలోని ఈజ్ నాకు చాలా ఇష్టం.