Bigg Boss: రెండు రోజులు.. రూ. 15 లక్షలు.. సిగ్గూశరం లేదారా మీకు

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:48 PM

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ రోజురోజుకూ సరికొత్త ట్విస్టులు, సంచలనాలతో దూసుకుపోతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో సరికొత్త డ్రామా, గొడవలు, వ్యూహాలు నిత్యం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

Bigg Boss Telugu 10

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu 10) రోజురోజుకూ సరికొత్త ట్విస్టులు, సంచలనాలతో దూసుకుపోతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో సరికొత్త డ్రామా, గొడవలు, వ్యూహాలు నిత్యం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, నామినేషన్ల వేడి, టాస్క్‌లలో ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలతో ప్రతిరోజూ హౌస్ రణరంగంగా మారుతోంది. ఇప్పటివరకు ఆట ఒక ఎత్తు అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మిథిలేష్ వంటి కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హౌస్‌లోని సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గతరాత్రి మిథిలేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టించాడు.


వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ అనే బిగ్ టాస్క్‌ను నిర్వహించాడు. కంటెస్టెంట్లను ఆకర్షించేందుకు వరుసగా క్యాష్ ఆఫర్లను ఇస్తూ నడిపిన ఈ గేమ్ తీవ్ర సస్పెన్స్ నడుమ సాగింది. మొదట రూ. 5 లక్షల నుంచి ప్రారంభమైన ఈ క్యాష్ ఆఫర్, క్రమంగా పెరుగుతూ ఏకంగా రూ.15 లక్షల మైలురాయికి చేరుకోవడంతో హౌస్‌మేట్స్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.


ఈ భారీ ఆఫర్ ముందుకొచ్చిన సమయంలో మిథిలేష్ ఊహించని నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. గొడవలు, టెన్షన్ల మధ్య గేమ్‌ను కొనసాగిస్తే మరింత పెద్ద బహుమతులు సాధించవచ్చని త్రిగుణ్ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, మిథిలేష్ ఆయన మాటలను వినకుండా ఆ రూ.15 లక్షల క్యాష్ సూట్‌కేస్‌ను స్వీకరించాడు. ఆ వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆయన తక్షణం నిష్క్రమించడంతో మిగతా సభ్యులంతా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తరువాత కంటెస్టెంట్స్ లో గొడవలు మొదలయ్యాయి. అగ్నిపరీక్ష టీమ్ అంతా మిథిలేష్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని చేతులు ఎత్తడంతో వారిపై ముఖేష్, త్రిగుణ్ మండిపడ్డారు. ఒకడోచ్చాడట.. రెండురోజులు ఉన్నాడట.. రూ, 15 లక్షలు తీసుకున్నాడట.. అతనికి వీళ్ళు చేతులు ఎత్తి సపోర్ట్ చేశారట.. సిగ్గు శరం లేదు అంటూ త్రిగుణ్ ఫైర్ అయ్యాడు.


మిథిలేష్ తీసుకున్న ఈ రూ. 15 లక్షల సొమ్ము నేరుగా బిగ్ బాస్ విజేతకు దక్కాల్సిన ప్రైజ్ పూల్ నుంచి తగ్గిపోతుండటంతో బయట ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరి వరకు పోరాడకుండా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం నిత్యం గొడవలతో సాగే షోలో రిస్క్ తీసుకోకుండా లక్షల రూపాయిలతో సేఫ్‌గా బయటకు రావడం తెలివైన ఆర్థిక నిర్ణయమని ప్రశంసిస్తున్నారు. మరోవైపు, హౌస్‌లో త్రిగుణ్ తన పదునైన వ్యూహాలతో మెప్పించగా, రోహిత్ వెనుక పూతలు , బ్యాక్‌బైటింగ్‌తో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. మొత్తానికి మిథిలేష్ ఎగ్జిట్‌తో బిగ్ బాస్ హౌస్‌లో రాబోయే రోజుల్లో ఆట ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

‘ద ప్యారడైజ్’.. 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..

‘రణబాలి’ విడుదలకు ముందే ఓటీటీలోకి.. అసలు విషయమిదే

తెలుగులో థియేట‌ర్ల‌కు.. కీర్తి సురేశ్, స‌నంత్‌ లెస్బియ‌న్ మూవీ

Updated Date - Sep 27 , 2026 | 03:53 PM