శుభవార్త చెప్పిన షణ్ముఖ్ జస్వంత్
ABN, Publish Date - Feb 25 , 2026 | 07:43 PM
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పెళ్ళిబాట పట్టాడు. గతంలోని లవ్ ఎఫైర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, ఇప్పుడు వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం జరుపుకున్నాడు.
నటనతో కంటే వివాదాస్పద వ్యవహారాలతో ఎక్కువగా మీడియాలో నిలిచిన వ్యక్తి షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth). బిగ్ బాస్ షోలో పాల్గొని బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడి కెరీర్ షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ, వెబ్ సీరిస్‌లోనూ నటించాడు. అయితే అనుకున్న బ్రేక్ మాత్రం షణ్ముఖ్ జస్వంత్‌కు రాలేదు. కానీ రకరకాల కారణాలతో మీడియాలో నానుతూ ఉన్నాడు. తాజాగా షణ్ముఖ్ తన అభిమానులకు ఓ శుభవార్తను తెలియచేశాడు. అదే అతని పెళ్ళి వార్త. కొద్ది రోజుల క్రితమే షణ్ముఖ్ తాను ప్రేమలో ఉన్నానని తెలియచేశాడు. ఆ అమ్మాయి వివరాలను గోప్యంగా ఉంచాడు. తాజాగా ఫిబ్రవరి 25న తనకు నిశ్చితార్థం అయినట్టు తెలిపాడు. అయితే పెళ్ళి ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియచేయలేదు.
షణ్ముఖ్ జస్వంత్ వివాహం చేసుకోబోతున్న అమ్మాయి కూడా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. వైష్ణవి చోడిశెట్టితో నిశితార్థం ఫోటోలను షణ్ముఖ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు అని కామెంట్ పెట్టాడు. దాంతో వీరిద్దరికీ నెటిజన్స్, స్నేహితులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.