Balakrishna: బాలయ్యను ప్రేమిస్తే ‘నో బ్రేకప్స్’...
ABN, Publish Date - Jun 08 , 2026 | 07:08 AM
ఏ క్యాలెండర్‌లోనూ లేని పండుగ, అభిమానుల గుండెల్లో మాత్రమే ఉండే పండుగ బాలయ్య పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆ రోజును అభిమానులు ఒక వేడుకలా నిర్వహిస్తున్నారు.
‘ఏ క్యాలెండర్‌లోనూ లేని పండుగ, అభిమానుల గుండెల్లో మాత్రమే ఉండే పండుగ బాలయ్య పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆ రోజును అభిమానులు ఒక వేడుకలా నిర్వహిస్తున్నారు. బాలయ్యకు ఇష్టమైన పని కష్టపడటం.. ఆయనకు ఇష్టమైనది సేవ.. అభిమానులు దానిని బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. బాలయ్య కూడా అభిమానులను గుండెల్లో పెట్టుకుంటారు’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు షురూ అయ్యాయి. జూన్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా అనంతపురం జగన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘భోళా బాలయ్య’ సాంగ్‌ను ఆదివారం దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘బాలయ్య ఏంటనేది నా సినిమాల ద్వారా చెప్పేశాను. ఈ సాంగ్ విషయానికొస్తే.. పాట అద్భుతంగా ఉంది. మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్, ఆర్టిస్టులు ఈ సాంగ్‌ను రూపొందించిన జగన్‌తో సహా అందరూ అద్భుతంగా కుదిరారు. విజువల్స్ గొప్పగా ఉన్నాయి. బాలయ్య చిన్నప్పటి ఫొటోల నుంచి ఇప్పటి వరకు ఉన్న విజువల్స్ చూస్తుంటే, పాట కంటే ఆ విజువల్స్‌తోనే ప్రేక్షకులు మరింత మమేకమైపోతారు. జగన్ కృషికి తప్పకుండా తగిన ఫలితం ఉంటుంది. ఈ పాటను ఆవిష్కంచే అవకాశం నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది. బాలయ్యకు ఇష్టమైన పని కష్టపడటం. ఆయనకు ఇష్టమైనది సేవ.. అభిమానులు దానిని బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందరి ఆశీస్సులతో బాలయ్య నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే’ అని అన్నారు.
ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్ వ్యవస్థాపకుడు అనంతపురం జగన్ మాట్లాడుతూ ‘బాలయ్య పుట్టిన రోజంటే మా అందరికీ పండుగ రోజు. దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటామో, అలాగే బాలయ్య బర్త్‌డేను జూన్ 1 నుంచి 10 వరకు కన్నుల పండుగగా చేసుకుంటాం. బాలకృష్ణ గారు సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర, చేసిన ేసవా కార్యక్రమాలు ఒక్క రోజులో చెప్పలేం. ఆయనతో గడిపిన ప్రతి నిమిషం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఐదు రంగాల్లో ప్రతిరోజూ దాదాపు 20 గంటలు కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈ దేశంలో లేరు. అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన మమ్మల్ని అంతగా అభిమానిస్తున్నారు కాబట్టే ఇలాంటి పాటలు పుడుతున్నాయి. బాలకృష్ణ గారిని సింహంలా చూపించి ‘అఖండ’ వంటి విజయాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ పాటను లాంచ్ చేయడం ఆనందంగా వుంది. బాలయ్య గారి వ్యక్తిత్వాని సరిపడేలా ఈ పాటకు ‘భోళా బాలయ్య’ అని పేరు పెట్టాం. ప్రేమలో బ్రేకప్‌లో ఉండొచ్చు, కానీ బాలయ్య బాబుగారిని ప్రేమిస్తే ‘నో బ్రేకప్స్’... అది జీవితాంతం ఉంటుంది. దర్శకుడు శివాజీ ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారు. కరీముల్లా, రుచేరా వైద్య ఎంతో ఎనర్జీతో పాడారు’ అని అన్నారు.
‘అనంతపురం జగన్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో బాలయ్యపై ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది’ అని లిరిసిస్ట్ దివాకర్ అమిలినేని అన్నారు.