బరి: ఎంతో ప్రత్యేకమైన సినిమా అంటున్న అన్నాచెల్లెళ్లు..
ABN, Publish Date - Mar 28 , 2026 | 02:39 PM
వరుణ్ తేజ్ (Varun Tej)హీరోగా ‘బరి’ (Bhari)చిత్రం శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.
వరుణ్ తేజ్ (Varun Tej)హీరోగా ‘బరి’ (Bhari)చిత్రం శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు యదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి పవన్‌కల్యాణ్ క్లాప్ కొట్టారు. నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ నిర్మాత రాజీవ్ రెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం..
రాఖీ పండుగా రోజే మాటిచ్చాడు: నిహారిక
‘మా నాన్న.. వాళ్ల అన్నయ్య, తమ్ముడు ఇద్దరితో సినిమాలు తీశారు. సొంత వాళ్లతో సినిమా తీస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. మా అన్నయ్యతో సినిమా చేయడం చాలా స్పెషల్. రాఖీ పండుగ రోజే సినిమా చేస్తానని మాటిచ్చాడు అన్నయ్య. దానికి కల్యాణ్ బాబాయ్ రావడం ఇంకా స్పెషల్. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రమిది. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది. యదు వంశీ కథపై నాకు నమ్మకం ఉంది. అందుకే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశాం. ఇంకా 8 నెలలే సమయం ఉంది కదా సరిపోతుందా అంటే.. అంతకుముందు ఎనిమిది నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వరుణ్ కూడా 7 నెలలుగా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో.. కథ.. ఇతర విషయాల్లో పక్కాగా ప్లాన్‌గా ఉన్నాం కాబట్టే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశాం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. ఈ మూవీ కచ్చితంగా చూడాలి.. కచ్చితంగా బాగుంటుంది అని ఆడియెన్స్ అనిపించేలా చేయడమే నా అంతిమ లక్ష్యం’ అని అన్నారు.
చెల్లి అభిరుచి నాకు తెలుసు: వరుణ్ తేజ్
‘ముకుందా’ చిత్రం తర్వాత మా బాబాయ్ మళ్లీ నా సినిమా ప్రారంభానికి వచ్చారు. చెల్లి నిహారిక నిర్మాతగా ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. చెల్లి, నేను కలిసి సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడే రాలేదు. వంశీ తెచ్చిన స్ర్కిప్ ఇలా సెట్ చేసింది. నిహారిక మంచి సినిమాలు తీస్తోంది. తన అభిరుచి మీద నాకు నమ్మకం ఉంది. కొత్తవారికి అవకాశం ఇవ్వడంతోపాటు టాలెంట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ విషయంలో తనని చూసి నేను గర్వపడుతున్నాను. కథ, ఈ టీమ్ మీదున్న నమ్మకంతో సినిమా ఓకే చేశా. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం’ అని అన్నారు.
స్పోర్ట్స్ డ్రామాతో ఎమోషన్స్ కూడా: యదు వంశీ
‘కమిటీ కుర్రోళ్లు’ తరువాత ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నా. వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ గారు మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగీ నిహారిక వద్దకే వెళ్లాను. 15 నిమిషాల కథ చెప్పి.. దీనికి వరుణ్ గారు కావాలని అడిగాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వరుణ్‌కి వినిపించాం. ఆయనకి కథ నచ్చింది. స్పోర్ట్స్ డ్రామాతోపాటు ఎమోషన్స్ బాగా ఉండే సినిమా ఇది. ప్రీ ప్రొడక్షన్ పనులు ముందే పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. కల్యాణ్‌గారు వచ్చి మా టీమ్‌ను ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
పదిరెట్టు ఎక్కువ: సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్
‘కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ‘బరి’లోని మ్యూజిక్ ఉంటుంది. వంశీ గారికి కూడా మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. ఈ చిత్రంలోనూ మ్యూజిక్‌కు చాలా స్కోప్ ఉంది. చాలా అద్బుతమైన మ్యూజిక్ రాబోతోంది’ అని అన్నారు.