Bharadwaja Thammareddy: 50 ఏళ్లుగా చూస్తున్నా.. సెన్సార్ బోర్డుతో అప్పట్లోనూ పేచీలే!
ABN, Publish Date - Nov 15 , 2026 | 09:31 AM
సెన్సార్ బోర్డుతో గతంలో ఎదురైన సమస్యలు, సినిమా టైటిళ్ల మార్పులు, సర్టిఫికెట్ల జాప్యంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇటీవల తరుచూ సెన్సార్ బోర్డు పేరు వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు (Censor Board) తో గతంలో ఎదురైన సమస్యలు, సినిమా టైటిళ్ల మార్పులు, సర్టిఫికెట్ల జాప్యంపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) ఆసక్తికర విషయాలు, తన స్వీయ అనుభవాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. నేను గత 50 ఏళ్లుగా చిత్రరంగంలో ఉన్నా. సెన్సార్ బోర్డు ఇప్పుడే కాదు.. గతంలో కూడా చాలా శక్తిమంతమైనదే! ఇప్పుడైతే అంతా ఆన్లైన్ అయిపోయింది కానీ నేను మద్రాసులో ఉన్నప్పుడు సినిమా సెన్సార్ కోసం వాళ్ల ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఆఫీసర్లను కలవడం గగనమనే చెప్పాలి. నిర్మాతలను కలవటానికి ఎవరూ ఇష్టపడేవారు కారు.
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రీజనల్ సెన్సార్ ఆఫీసర్లను కలవటం సులభమయింది. రత్నప్రభ నుంచి కైలాష్ ప్రసాద్ వరకూ నాకు బాగా తెలుసు. వాళ్లను మేము కలుస్తూనే ఉండేవాళ్లం. అయినా రూల్స్ విషయంలో రాజీపడేవారు కాదు. నేను ‘మన్మథ సామ్రాజ్యం’ (Manmadhya Samrajyam) అనే సినిమా తీశా. సెన్సార్ బోర్డులో ఆరు నెలలు ఆగిపోయింది. ఆ ఒక్కటే కాదు- నేను తీసిన- ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’, ‘స్వర్ణక్క’, ‘నేటి దౌర్జన్యం’, ‘కోతల రాయుడు’, ‘మొగుడు కావాలి’ సినిమాలకు కూడా రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. ఇక ‘అలజడి’ (Alajadi) సినిమాకయితే మూడు రోజులు ఆఫీసు ముందు ధర్నా చేసినంత పనిచేశాం. అయితే ఈ మధ్యనే నేను ’వదల’ (Vadala Movie) అనే సినిమా తీశా. దాని కోసం ఆఫీసులో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా చాలా సులభంగా సెన్సార్ అయిపోయింది. నా 50 ఏళ్ల సినీ జీవితంలో ఇదొక అరుదైన సంఘటన.
కొన్ని తప్పవు...
సినిమా పేర్ల విషయంలో సెన్సార్ బోర్డుతో నిర్మాతలకు గతంలో కూడా పేచీలు ఉన్నాయి. జన సామాన్యంలో అందరూ వాడే పదాలను సెన్సార్ వాళ్లు ఎందుకో ఒప్పుకోరు. ఉదాహరణకు నేను ‘దౌర్జన్యం’ అనే సినిమా తీశా. దౌర్జన్యమంటే హింస కాబట్టి ఆ పేరు వద్దన్నారు. కిందా మీదా పడి - ’నేటి దౌర్జన్యం’ (Neti Dourjanyam) అని మార్చాం. ఇలాగే ‘సరస్వతి’ సినిమా పేరును ‘ఎస్ సరస్వతి’గా మార్పించారు. ఇంతకన్నా ఒక ఆసక్తికరమైన సంఘటన చెబుతాను. నేను ’దొంగ రాస్కెల్’ అనే సినిమా తీశాను. దానికి సెన్సారు బోర్డు అభ్యంతరం చెప్పలేదు. కానీ ’స్వర్ణక్క’ (Swarnakka) అనే నా సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర - ఒక వ్యక్తిని ’రాస్కెల్’ అంటాడు. ముఖ్యమంత్రి పాత్ర ద్వారా ఆ డైలాగ్ చెప్పకూడదని సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. చివరకు ఆ పదం కత్తిరించే వరకూ ఊరుకోలేదు. ఇవి చూడటానికి చాలా చిన్న మార్పులుగానే కనిపిస్తాయి. కానీ నిర్మాతకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
మా వైపూ సమస్యలున్నాయి..
ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. సెన్సార్ సమస్యలతో పాటుగా మా నిర్మాతల వైపు నుంచి కూడా కొన్ని సమస్యలున్నాయి. ఈ మధ్య కాలంలో సెన్సార్‌కు వెళ్లే సమయానికి కూడా కాపీ రెడీ కావటం లేదు. రీరికార్డింగ్ పూర్తి కాదు. డమ్మీ కాపీలు చూపించి సర్టిఫికెట్లు అడుగుతున్నారని సెన్సార్ ఆఫీసర్లు వాపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో మేము సినిమా అంతా పూర్తయిన తర్వాతే సెన్సార్‌కు అప్లై చేసేవాళ్లం. కానీ ఇప్పుడు కొందరు కాపీ పూర్తిగా రెడీ కాకుండానే సర్టిఫికెట్ (Censor Certificate) కోసం అప్లై చేస్తున్నారు. అప్లై చేయటమే కాదు. రిలీజ్ డేట్స్‌ను కూడా ప్రకటించేస్తున్నారు. మేము డేట్ ప్రకటించాం కాబట్టి సర్టిఫికేట్ కావాలని ఒత్తిడి పెడుతున్నారు.
సాధారణంగా ఏదైనా పెద్ద సినిమాల రిలీజ్‌కు థియేటర్లు ముందే బుక్ అయిపోతాయి. చిన్న సినిమాల రిలీజ్లు ఉండవు. అలాంటి సమయంలో హఠాత్తుగా సెన్సార్ సర్టిఫికెట్ రాక సినిమా విడుదల ఆగిపోతే కలకలం చెలరేగుతుంది. చిన్న సినిమాలు వెంటనే రిలీజ్ చేయటానికి ఉండదు. షెడ్యూల్ ప్రకారం ముందే రిలీజ్ అయ్యే చిన్న సినిమాలపై పెద్ద వాటి ప్రభావం పడుతుంది. ఈ సమస్యలన్నీ నివారించాలంటే ఛాంబర్ చొరవ తీసుకోవాలి. సినిమా పూర్తి అయిన తర్వాతే సెన్సార్ సర్టిఫికెట్‌కు అప్లై చేసుకొవాలనే స్వచ్ఛంద నిబంధనను అమలులోకి తేవాలి. అప్పుడు సెన్సార్ బోర్డు మీద ఒత్తిడి ఉండదు.
డైలాగ్స్‌లో, పాటల్లో పదాల వరకూ పరవాలేదు. టైటిల్స్ (Film Title Controversy) మారిస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సాధారణంగా ఒక సినిమా సెన్సార్‌కు వెళ్లే సమయానికి పోస్టర్లు కూడా ప్రింటయిపోతాయి. టైటిల్‌ను పూర్తిగా మారిస్తే ఆ పోస్టర్లు పనికిరావు. అప్పటిదాకా ప్రచారం కూడా జరిగిపోయి ఉంటుంది కాబట్టి ప్రేక్షకుడు పేరుమారిన ఆ సినిమాని గుర్తుపట్టడని తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల జరిగిన, జరుగుతున్న అంశాలపై తన అభిప్రాయం వెళ్లడించారు.