కార్తీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి! హిట్ 4 కాదని.. ఆ కామెడీ డైరెక్టర్‌తో తెలుగు మూవీ?
ABN, Publish Date - May 08 , 2026 | 11:02 AM
కోలీవుడ్ హీరో అయినా, టాలీవుడ్ కుర్రాడిలా మన ప్రేక్షకులు ఓన్ చేసుకున్న నటుడు కార్తీ.
కోలీవుడ్ హీరో అయినా, టాలీవుడ్ కుర్రాడిలా మన ప్రేక్షకులు ఓన్ చేసుకున్న నటుడు కార్తీ (Karthi). రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ తర్వాత, ఇక్కడి జనం తన సొంత మనిషిగా భావించే హీరో ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా కార్తీనే. ఊపిరి సినిమాతో నేరుగా తెలుగు వెండితెరపై మెరిసి, మన ఆడియెన్స్‌కు మరింత చేరువయ్యారు. ఇప్పుడు మరోసారి తెలుగు గడ్డపై తన మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కాంబినేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నవ్వుల విందు గ్యారెంటీ అనిపిస్తోంది.
రీసెంట్‌గా మ్యాడ్ ఫ్రాంచైజీతో యూత్‌ను ఉర్రూతలూగించిన డైరెక్టర్ కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) గురించి మనకు బాగా తెలుసు. క్లీన్ అండ్ క్రేజీ కామెడీని పండించడంలో ఆయన స్టైలే వేరు. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) భారీ నిర్మాణ విలువలతో కార్తీ, కల్యాణ్ శంకర్ కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు, వింటేజ్ కార్తీ మార్క్ కామెడీతో ఉండబోతోందని సమాచారం. చాలా మంది కార్తీ హిట్ ఫ్రాంచైజీలో భాగమవుతారని అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఆయన ఈ కామెడీ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
ఈ సినిమాలో కార్తీ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఫ్రెష్‌గా ఉండబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద బ్యానర్ తోడవడంతో, ఈ చిత్రం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కనుంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమాపై ఫోకస్ పెడుతూనే, మరోవైపు తన పాన్ ఇండియా ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు కార్తీ.
ఆయన కెరీర్‌లో భారీ హిట్ అందుకున్న సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా సర్దార్ - 2 రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గూఢచారి నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. కల్యాణ్ శంకర్ ప్రాజెక్ట్ తర్వాత కార్తీ మరో టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ శైలేష్ కొలనుతో హిట్-4 చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిట్ ఫ్రాంచైజీ తో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న శైలేష్, కార్తీ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే రాబోయే రోజుల్లో కార్తీ నుంచి మరిన్ని తెలుగు సినిమాలు రావడం ఖాయం. కేవలం ఒక్క జోనర్‌కే పరిమితం కాకుండా, రూట్ మార్చి విభిన్న కథలను ఎంచుకోవడంలో కార్తీ ఎప్పుడూ ముందుంటారు. అటు సీరియస్ యాక్షన్, ఇటు కడుపుబ్బ నవ్వించే కామెడీ.. ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. మరి కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఈ సరికొత్త వినోదం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.