Bandla Ganesh: మహేష్ బాబు ఇంటికి బండ్ల గణేష్.. కుమార్తె పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం
ABN, Publish Date - Jul 23 , 2026 | 10:07 PM
నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహానికి ఆహ్వానించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ఘట్టమనేనిని కుటుంబ సభ్యులను కలిశారు.
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. తన కుమార్తె జనని వివాహానికి ఆహ్వానించేందుకు బండ్ల గణేష్ ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ స్వయంగా కలిసి ఆహ్వనిస్తున్న సంగతి అందరికీ విధితమే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ గురువారం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) దంపతులను కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ తన కుటుంబంతో సహా వచ్చి మహేష్ బాబు దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందించి, పెళ్లికి తప్పకుండా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే తాను మహేశ్ ఫ్యామిలీని కలిసిన సందర్భంగా బండ్ల గణేశ్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇందులో ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరగనున్న మా కుమార్తె వివాహ వేడుకలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Urstruly Mahesh) గారిని, శ్రీమతి నమ్రత గారిని ఆప్యాయంగా ఆహ్వానించే అదృష్టం కలిగింది. వారితో గడిపిన కొద్ది క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. వారు చూపించిన ఆప్యాయత, ప్రేమ, వినయం, మా కుటుంబ యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న తీరు నా హృదయాన్ని హత్తుకుంది.
ఎంతటి శిఖరాగ్రంలో ఉన్నా అదే సరళత, అదే మానవత్వం, అదే అభిమానాన్ని పంచే మహేష్ బాబు గారు నిజంగా గొప్ప వ్యక్తి. శ్రీమతి నమ్రత గారి ఆత్మీయత, ఆదరణ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఈ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భగవంతుడు మహేష్ బాబు గారికి, నమ్రత గారికి ఆయురారోగ్యాలు, ఆనందం, మరెన్నో విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏❤️ అని పేర్కొన్నారు.