Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..
ABN, Publish Date - Jul 04 , 2026 | 12:37 PM
నిర్మాత బండ్ల గణేశ్ ఆస్తి వేలం వివాదంపై స్పందించారు. లోను వసూళ్లలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న బండ్ల గణేశ్, ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం ద్వారా విక్రయించింది.
నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఆస్తి వేలం వివాదంపై స్పందించారు. లోను వసూళ్లలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న బండ్ల గణేశ్, ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం ద్వారా విక్రయించింది. అయితే, దీన్ని రద్దు చేయడంతోపాటు వేలం ద్వారా వచ్చిన సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆస్తి వేలం సబబే అని తీర్పు ఇచ్చింది. దీనిపై బండ్ల గణేశ్ స్పందించారు. తన ఆస్తిని బ్యాంక్ వాళ్లు అన్యాయంగా విక్రయించారని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. (Bandla Ganesh Property Auction)
‘అన్యాయంగా, మార్కెట్ విలువకు చాలా తక్కువగా లోపాయికారీ ఒప్పందంతో బ్యాంకు అధికారులు నా ఆస్తిని విక్రయించారు. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. ఈ కేసులో కింది డీఆర్‌టీలో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే హైకోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. నాకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిజాయతీగా నా హక్కుల ఆధారంగా న్యాయం సాధిస్తాననే అచంచలమైన నమ్మకం నాకు ఉంది’ అని పేర్కొన్నారు.