సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bandla Ganesh: సుప్రీంకోర్టులో బండ్ల గణేశ్‌కు షాక్.. అసలు విషయం ఇదే

ABN, Publish Date - Jul 23 , 2026 | 03:51 PM

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్కు ఆస్తి వేలం వివాదంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Bandla Ganesh

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు ఆస్తి వేలం వివాదంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్‌లోని తన కుటుంబానికి చెందిన ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు యథాతథంగా కొనసాగనుంది. 

ఈ కేసు శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్‌కు సంబంధించిన రుణాల నేపథ్యంలో ప్రారంభమైంది. ఆ సంస్థ తీసుకున్న రుణాలకు బండ్ల గణేశ్ కుటుంబ సభ్యులు హామీదారులుగా నిలిచారు. రుణ బకాయిలు చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద 2019లో హామీదారుల ఆస్తిని స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో నిర్వహించిన వేలంలో జూబ్లీహిల్స్ ఆస్తిని సుమారు రూ.8.51 కోట్లకు విక్రయించింది. వేలం ప్రక్రియను ప్రశ్నిస్తూ బండ్ల గణేశ్ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ)ను ఆశ్రయించారు. డీఆర్టీ మొదట వేలాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆ నిర్ణయాన్ని యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. కేసును పరిశీలించిన హైకోర్టు బ్యాంక్ వాదనను సమర్థిస్తూ డీఆర్టీ తీర్పును రద్దు చేసింది.

ఈ సందర్భంగా బండ్ల గణేశ్ తరఫు న్యాయవాదులు, సంబంధిత కంపెనీపై జాతీయ కంపెనీ న్యాయ ట్రిబ్యునల్ (NCLT)లో దివాళా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నందున వేలం చెల్లదని వాదించారు. అయితే యూనియన్ బ్యాంక్ తరఫు న్యాయవాదులు, వేలానికి వెళ్లిన ఆస్తి కంపెనీది కాదని, రుణాలకు హామీ ఇచ్చిన వ్యక్తుల వ్యక్తిగత ఆస్తి అని పేర్కొన్నారు. అందువల్ల సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంక్ చర్యలు చట్టబద్ధమేనని వాదించారు. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో బండ్ల గణేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో యూనియన్ బ్యాంక్ చేపట్టిన ఆస్తి వేలం ప్రక్రియకు మరోసారి న్యాయపరమైన మద్దతు లభించినట్లైంది. ఈ తీర్పుతో బండ్ల గణేశ్‌కు ఈ కేసులో ప్రస్తుతం ఎలాంటి ఊరట లభించలేదు.


ఈ విషయంపై బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీ మాత్రమే ఈ కేసుకు సంబంధించినది. కొందరు నా మొత్తం ఆస్తి ఈ కేసుకు సంబంధించినదని లేదా మొత్తం ఆస్తినే కోల్పోయానని అపోహ పడుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఈ కేసు షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీకి మాత్రమే పరిమితమైంది. ఆ ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ 2022లో రూ8.51 కోట్లకు విక్రయించారు. ఆ విక్రయాన్ని నేను చట్టపరంగా సవాలు చేశాను. డీఆర్‌టీలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, అనంతరం హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో మా పిటిషన్ తిరస్కరించబడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును నేను సంపూర్ణంగా గౌరవిస్తున్నాను. భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల తీర్పులను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యతగా భావిస్తున్నాను. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తూ, భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పట్ల నా గౌరవాన్ని మరోసారి వ్యక్తం చేస్తున్నాను' అని పేర్కొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 04:07 PM