Bandla Ganesh: అదే నా సంకల్పం.. ఎవరి గురించి ఆలోచన లేదు
ABN, Publish Date - Aug 22 , 2026 | 09:20 PM
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది. స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి, చిన్న చిన్న పాత్రలతో తన నటనను ప్రారంభించాడు.
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది. స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి, చిన్న చిన్న పాత్రలతో తన నటనను ప్రారంభించాడు. కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత నటుడిగానే కాకుండా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతగా మారి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు. పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ వంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ నిర్మించడమే కాకుండా, ఎన్టీఆర్‌తో బాద్‌షా, టెంపర్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో వంటి భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి అగ్ర నిర్మాతలలో ఒకడిగా నిలిచాడు.
అయితే, సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన బండ్ల. . పొలిటికల్ ఎంట్రీతో పాటు కొన్ని వివాదాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన సినిమా నిర్మాణానికి సుదీర్ఘ కాలం పాటు దూరమవ్వాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని సినిమాల్లో నటుడిగా కనిపించినప్పటికీ, ప్రొడ్యూసర్‌గా పెద్ద గ్యాప్ వచ్చింది. తాజాగా ఆ రాజకీయ రచ్చకు, ఇతర వ్యాపకాలకు స్వస్తి పలుకుతూ.. ఇకపై తన శ్రమ, సమయం, శక్తి అంతా కేవలం సినిమా నిర్మాణం పైనే పెడతానని బండ్ల గణేష్ స్పష్టం చేశాడు. ఓన్లీ బ్లాక్‌బస్టర్లే లక్ష్యంగా ఆయన మళ్లీ ప్రొడక్షన్ ఫీల్డ్‌లోకి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈమధ్యనే బండ్ల గణేష్ టాలీవుడ్ ప్రముఖులకు పెద్ద పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. అంతేకాకుండా కూతురు జనని పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా జరిపించాడు. సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక బండ్ల గణేష్ ఇదంతా చేయడం వెనుక మళ్లీ ఇండస్ట్రీలోకి రావలన్న కసి కనిపిస్తోంది. ఇక ఎట్టకేలకు బండ్ల అధికారికంగా తన సినీ ప్రయాణం గురించి ప్రకటించాడు. ఇక ఎవరి గురించి, దేని గురించి పట్టించుకొనవశం లేదని, తన లక్ష్యం కేవలం హిట్ సినిమాలను అందించడమే అని చెప్పుకొచ్చాడు. 'ఇక నా దృష్టి ఒక్కటే.. నా నిర్ణయం ఒక్కటే.. నా ప్రయాణం ఒక్కటే.. సినిమా నిర్మాణం. ప్రస్తుతం నాకు మరే విషయంతోనూ సంబంధం లేదు. ఎవరి గురించి ఆలోచన లేదు, ఏ ఇతర విషయంపై దృష్టి లేదు. ఓన్లీ బ్లాక్‌బస్టర్ సినిమాలు తీయాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నాను. నా శ్రమ, నా సమయం, నా శక్తి మొత్తం ఇక సినిమాకే. ఒక్కటే లక్ష్యం.. మంచి సినిమా.. గొప్ప విజయం.. బ్లాక్‌బస్టర్' అంటూ చెప్పుకొచ్చాడు. మరి బండ్ల రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.