సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: గోపీచంద్, శివ ఇద్దరితోనూ సాగనున్న బాలకృష్ణ

ABN, Publish Date - Apr 28 , 2026 | 02:15 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ స్పీడు ఆషామాషీగా లేదు. తన తరం హీరోలెవరూ చూపించని వేగం బాలయ్య ప్రదర్శిస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలను ఓకే చేసి బిజీబిజీగా సాగే ప్రయత్నంలో ఉన్నారు బాలయ్య!

Balakrishna

వయసులో ఉన్నప్పుడు టాప్ స్టార్స్ ఎందరో ఏడాదికి ఆరు, ఏడు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆరు పదులు దాటగానే వేగం తగ్గించి ఎంచక్కా రిలాక్స్ గా సినిమాల్లో నటిస్తూ సాగుతున్నారు అనేకమంది స్టార్ హీరోస్. నందమూరి బాలకృష్ణ మాత్రం తన రూటే సెపరేటు అంటూ పయనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. అయినా ఓ వైపు నటునిగా బిజీగా ఉన్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. అలాగే తన తల్లి పేరిట నెలకొన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా ఈ సారి సినిమాల సంఖ్య పెంచాలని యోచిస్తున్నారు బాలయ్య. అందుకు తగ్గట్టుగానే పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా అయిన తరువాత మరో చిత్రాన్ని లైన్ లో పెడతారు ఎవరైనా. అయితే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.ఆ సినిమా ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే మరో చిత్రాన్ని లైన్ లో పెట్టనున్నారట బాలయ్య.


ఈ మధ్యే బాలకృష్ణకు డైరెక్టర్ కొరటాల శివ ఓ సబ్జెక్ట్ వినిపించారు. ఆ సబ్జెక్ట్ బాలయ్యకు ఎంతగానో నచ్చిందని, త్వరలోనే షూటింగ్ మొదలు కానుందనీ సమాచారం. ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఇక బాలయ్యతో కొరటాల శివ రూపొందించే చిత్రానికి సాహు గారపాటి, మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సమాంతరంగా ఈ రెండు చిత్రాల షూటింగ్ జరపనున్నారు. వేసవి పూర్తి కాగానే ఈ రెండు చిత్రాల కోసం డేట్స్ కేటాయించారు బాలకృష్ణ. అంటే పాత రోజుల్లోలాగా ప్రతి నెలలో కొన్ని రోజులు గోపీచంద్ మలినేని సినిమాకు, మరి కొన్ని రోజులు కొరటాల శివ చిత్రానికి కేటాయించనున్నారు.


రెండు సినిమాల్లో ఒకటి సంక్రాంతికి వస్తే, మరోటి ఎప్పుడు వస్తుందనే అనుమానం కలుగక మానదు. రెండు సినిమాలు వచ్చే సంవత్సరమే వెలుగు చూస్తాయని వినిపిస్తోంది. అయితే ఈ యేడాది బాలయ్య సినిమా లేనట్టేనా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. నిజానికి బాలయ్య-గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఈ యేడాదే దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కథలో మార్పులు జరగడం, క్యాస్టింగ్ లోనూ ఛేంజెస్ చోటు చేసుకోవడంతో బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయింది. మరి బాలయ్య - కొరటాల శివ మూవీ ఎప్పుడు ఎలా ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.

Updated Date - Apr 28 , 2026 | 02:15 PM