సంక్రాంతి బరిలో.. బాబాయ్ Vs అబ్బాయి! ఈ సారి ఆట మాములుగా ఉండదు
ABN, Publish Date - Mar 05 , 2026 | 08:08 PM
రానున్న సంక్రాంతికి థియేటర్లకు రాబోతున్న సినిమాల విషయంలో ఓ అరుదైన ఆసక్తికరమైన పోరు ఉండనుంది.
టాలీవుడ్‌లో సంక్రాంతి (Sankranthi) సీజన్ అంటేనే భారీ చిత్రాల వేదిక. వచ్చే 2027 సంక్రాంతి పోరు అప్పుడే సినీ వర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ నందమూరి అన్నట్లుగా ఒక ఆసక్తికరమైన పోరు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయి కళ్యాణ్ రామ్ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తుతోంది.
నటసింహ బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand malineni) కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' సంక్రాంతి విజేతగా నిలిచిన నేపథ్యంలో, ఈ కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది.
మరోవైపు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం కూడా అదే సమయానికి సిద్ధమవుతోంది. వినోదానికి పెద్దపీట వేసే అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కూడా సంక్రాంతి రేసులో నిలవడంతో నందమూరి అభిమానుల మధ్య ఒక విలక్షణమైన పోటీ వాతావరణం కనిపిస్తోంది.
ఈ బాక్సాఫీస్ వార్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాత్ర కీలకం కానుంది. తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచే తారక్, ఈ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ ఈ చిత్రానికి చీఫ్ గెస్టుగా వస్తే, సినిమా హైప్ అమాంతం పెరగడం ఖాయం. ఒక పక్క బాబాయ్ సినిమా, మరోపక్క అన్నయ్య సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ మద్దతు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా పండగ సీజన్‌లో పెద్ద సినిమాలు పోటీ పడటం సహజమే అయినా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు తలపడటం విశేషం. ఇది నందమూరి అభిమానులను రెండు వర్గాలుగా విభజిస్తుందా లేక రెండు సినిమాలను ఆదరిస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా 2027 సంక్రాంతి మాత్రం తెలుగు సినీ ప్రియులకు ఒక స్పెషల్ బాక్సాఫీస్ విందును అందించబోతోంది.