మళ్ళీ ఖాకీ దుస్తుల్లో నందమూరి నట సింహం...
ABN, Publish Date - Apr 11 , 2026 | 02:27 PM
నటసింహ బాలకృష్ణ మరోమారు పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. కాప్ గా ఖాకీ దుస్తుల్లో బాలయ్య అలరించిన తీరు అనితరసాధ్యం. రాబోయే సంక్రాంతికి బాలయ్య ఇన్ స్పెక్టర్ గానే బరిలో దూకనున్నారట.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన తరం హీరోల్లో ఎక్కువగా పోలీస్ పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ విషయంలోనూ ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. గతంలో నటరత్న యన్టీఆర్ (NTR) అనేక చిత్రాల్లో పోలీసాఫీసర్ గా నటించి ఘనవిజయాలు సాధించారు. అదే తీరున బాలకృష్ణ కూడా ఖాకీ యూనిఫామ్ లో ఇన్ స్పెక్టర్ గా పలు చిత్రాల్లో మురిపించి విజయం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మరోమారు పోలీస్ పాత్రలోనే బాలయ్య కనిపిస్తారని విశేషంగా వినిపిస్తోంది. బాలయ్య 111వ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రానికి గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు. ఇక బాలయ్య నటించే 112వ చిత్రంలో ఆయన పోలీస్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. యస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'నాందీ, ఉగ్రమ్, భైరవం' చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. విజయ్ వినిపించిన పోలీస్ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందని అందువల్లే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
బాలయ్య ఇన్ స్పెక్టర్ రోల్స్ లో కనిపించడం కొత్తేమీ కాదు. 1985లో తొలిసారి 'భలే తమ్ముడు' (Bhale Thammudu) చిత్రంలో బాలయ్య కాప్ రోల్ పోషించారు. ఆ తరువాత 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్ స్పెక్టర్, మాతో పెట్టుకోకు, సీమసింహం, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీనరసింహా, అల్లరి పిడుగు, రూలర్, భగవంత్ కేసరి' చిత్రాల్లోనూ బాలయ్య ఇన్ స్పెక్టర్ రోల్స్ లో మురిపించారు. వీటిలో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గానూ నిలవడం విశేషం. అందువల్ల బాలయ్య మరోమారు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేస్తున్నారు.
బాలకృష్ణ ఇన్ స్పెక్టర్ గా నటించబోయే చిత్రం 2027 సంక్రాంతికి రిలీజ్ కానుందని తెలుస్తోంది. గతంలోనూ సంక్రాంతి బరిలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా బాలయ్య నటించిన చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. వాటిలో 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్', 'లక్ష్మీ నరసింహా' పోటీ చిత్రాలపై ఆధిక్యం సాధించాయి. అందువల్ల విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలయ్య నటించబోయే పోలీస్ స్టోరీ సైతం ప్రేక్షకులను మురిపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికి దాదాపు డజన్ చిత్రాల్లో పోలీస్ రోల్స్ లో మురిపించిన బాలయ్య రాబోయే సినిమాతో ఏ తీరున అలరిస్తారో చూడాలి.