బాలకృష్ణకు.. విజయవంతంగా మోకాలి సర్జరీ
ABN, Publish Date - Jul 23 , 2026 | 09:03 PM
షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లో విజయవంతంగా మోకాలి సర్జరీ పూర్తైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇటీవల కాకినాడ పోర్ట్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురైన నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. బాలకృష్ణ తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్గ్ బులిటెన్ విడుదల చేశారు. వైద్యుల బృందం గురువారం దాదాపు మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించినట్లు, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయనను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఓ ప్రకటన సైతం రిలీజ్ చేశారు.
కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్ట్‌లో జరుగుతున్న తన తాజా సినిమా షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ కాలుజారి పడడంతో మోకాలికి గాయమైంది. తొలుత స్వల్ప గాయంగా భావించినప్పటికీ, వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. సర్జరీ విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.