బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆపడం కష్టమే!
ABN, Publish Date - Sep 30 , 2026 | 11:52 AM
నటసింహం నందమూరి బాలకృష్ణ కాస్త విరామం తర్వాత మరలా యాక్షన్‌లోకి దిగబోతున్నారు.
మాస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మళ్లీ యాక్షన్‌లోకి దిగబోతున్నారు. ఇటీవల 'దాదాస (dada) సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయనకు చిన్నపాటి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో డాక్టర్ల సలహా మేరకు బాలయ్య కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు.
అక్టోబర్ నుంచి నటసింహం మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారని ఫిలింనగర్ టాక్. 'వీరసింహారెడ్డి' వంటి హిట్ తర్వాత గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. అక్టోబర్ నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్‌లో బాలయ్య పాల్గొని, మిగిలిన భాగంతో పాటు భారీ యాక్షన్ సీన్లను పూర్తి చేయనున్నారట.
ఈ సినిమా పూర్తవ్వడమే ఆలస్యం, నటసింహం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. మొదట బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించి, ఆ తర్వాత ఆయన సెట్లోకి రాగానే ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఇందుకోసం హైదరాబాద్‌లో కోట్లు ఖర్చు చేసి ఒక పవర్‌ఫుల్ భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారట. బాలయ్యను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్‌లో, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయేలా కొరటాల ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ వార్త నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.
అంటే బాలకృష్ణ తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించబోతున్నారు. ఒకవైపు పవర్‌ఫుల్ తండ్రి పాత్ర... మరోవైపు విభిన్నమైన షేడ్స్ ఉన్న కొడుకు పాత్రలో బాలయ్య విశ్వరూపం చూడబోతున్నామని తెలుస్తోంది. 'దేవర' లాంటి హిట్ తర్వాత కొరటాల శివ తీస్తున్న సినిమా కావడంతో, స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పక్కా ప్రణాళికతో కథను సిద్ధం చేశారట. సమాజంలోని బలమైన రాజకీయ అంశాలతో పాటు, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగభరితమైన ఫ్యామిలీ డ్రామాను ఈ చిత్రంలో కొరటాల మార్క్ మేకింగ్‌తో అందించబోతున్నారు.
మరోవైపు బాలయ్య డ్యూయల్ రోల్‌లో తండ్రీకొడుకులుగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘చెన్నకేశవరెడ్డి’, ‘సింహా’, ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు మళ్లీ తండ్రీకొడుకులుగా.. అది కూడా కొరటాల శివ లాంటి పవర్‌ఫుల్ డైరెక్టర్‌తో బాలయ్య డ్యూయల్ రోల్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మేకోవర్ విషయంలోనూ బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నారట. మరి డ్యూయల్ రోల్‌లో బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.