బాలకృష్ణ రూటు మార్చారా !?
ABN, Publish Date - Feb 11 , 2026 | 04:38 PM
నటసింహ నందమూరి బాలకృష్ణ రూటు మార్చారని, కొత్త పంథాలో వెళ్తున్నారని విశేషంగా వినిపిస్తోంది. అసలు బాలయ్య ఎప్పుడూ రొటీన్ కు భిన్నంగానే సాగుతుంటారు. కాబట్టి కొత్తగా రూటు మార్చిందేమీ లేదు. మరి ఎందుకలా వినిపిస్తోంది!?
బాలకృష్ణ (Balakrishna) రూటు మార్చారని, వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారని చెబుతున్నారు. సబ్జెక్ట్స్ నచ్చితే చాలు వెంటనే పట్టాలెక్కించాలనే చూస్తారు బాలయ్య. ఇది మొదటి నుంచీ ఆయనకున్న అలవాటే. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే బాలకృష్ణ వరుసగా మూడు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారని వినిపిస్తోంది. అందులో మొదటిది గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలయ్య నటించే చిత్రం. ఈ మూవీ షూటింగ్ మార్చి 19న ఉగాదికి మొదలు కానుంది. దసరా కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు నిర్మాత వెంకట సతీశ్ కిలారు. ఆ తరువాత హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో నాగవంశీ (Nagavamshi) నిర్మించబోయే చిత్రంలోనూ బాలయ్య నటిస్తారని వినిపిస్తోంది. వివేక్ ఆత్రేయ (Vivek Atreya) దర్శకత్వంలోనూ బాలయ్య ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వీటిలో వివేక్ ఆత్రేయ మూవీపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి దాకా టాప్ స్టార్స్ ను హ్యాండిల్ చేయని వివేక్ ఆత్రేయ బాలయ్య లాంటి మాస్ హీరోను ఎలా తెరపై చూపిస్తారో అన్న ఆసక్తి కలుగుతోంది. ఈ మూవీని బాలయ్యతో ఇంతకు ముందు 'వీరసింహారెడ్డి' నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారని వినిపిస్తోంది. ఇలా ఈ మూడు చిత్రాలు ఫ్యాన్స్ లోనూ, టాలీవుడ్ జనంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తన తరం హీరోల్లో బాలకృష్ణ అంత విలక్షణంగా సాగిన నటుడు మరొకరు కానరారు. కేవలం తెలుగుచిత్రసీమలోనే కాదు యావద్భారతంలోనూ బాలయ్య తీరే వేరుగా సాగింది. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో తనదైన బాణీ పలికిస్తూ నటించారాయన. ఇక సైన్స్ ఫిక్షన్ తో పాటు చారిత్రక నేపథ్యాన్ని మేళవించి 'ఆదిత్య 369'లో బాలయ్య పయనించిన తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అప్పట్లో టాప్ స్టార్స్ అందరూ ధనాధన్, ఫటాఫట్ అంటూ యాక్షన్ మూవీస్ తో సాగుతూ ఉంటే, తానూ అదే పంథాలో పయనిస్తూనే మరోవైపు 'నారీ నారీ నడుమ మురారి' వంటి వినోద భరిత చిత్రంలో నటించారు. ఇందులో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం గమనార్హం!. ఇలా బాలయ్య నటజీవితం మొదటి నుంచీ వైవిధ్యంగానే సాగుతోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం 'బాలకృష్ణ నటజీవిత స్వర్ణోత్సవం'లో ప్రస్తావించడం విశేషం!. అలా మొదటి నుంచీ విలక్షణంగా సాగుతోన్న బాలయ్య ఇప్పుడు నటించబోయే మూడు చిత్రాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించనున్నారని సమాచారం.
వైవిధ్యమే ప్రధానం...
ప్రస్తుతం బాలయ్యతో గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ తో యాక్షన్ ను మిక్స్ చేసుకొని రూపొందనుందట. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని హరీశ్ శంకర్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఈ నాటి పాలిటిక్స్ ను కూడా జోడించి ఓ సబ్జెక్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. 'బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి' వంటి విభిన్న కథాంశాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ కూడా బాలయ్యను ఓ న్యూ యాంగిల్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. ఇలా రాబోయే మూడు చిత్రాల్లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. అందువల్లే ఆయన సినిమాలపై చర్చ సాగుతోంది. 'అఖండ-2- తాండవం'పై ఎన్నో ఆశలు పెట్టుకొని నిరాశ చెందిన అభిమానులకు ఆనందం పంచడానికే బాలయ్య వరైటీ రోల్స్ కు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది ఎప్పుడు ఎలా ప్రేక్షకుల ముందు నిలుస్తుందో చూడాలి.