సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Balakrishna: బాలయ్య.. కొత్త సినిమాకు 60 కోట్ల కోత

ABN, Publish Date - Jan 27 , 2026 | 10:51 PM

నటసింహ బాలకృష్ణ సినిమాల టాక్ ఎలా ఉన్నా సరే వంద కోట్లు ఖాయం అనేలా ఉన్నాయి. అలాంటి బాలయ్య కొత్త సినిమా కోసం భారీ మొత్తాన్ని తగ్గించి సెట్స్ కు వెళ్తున్నట్టు సమాచారం.

Balakrishna

సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్ళతో వరుసగా ఐదు చిత్రాలు చూశారు బాలకృష్ణ (Balakrishna). వీటిలో తొలి నాలుగు చిత్రాలు బడ్జెట్‌కు తగ్గ రాబడి చూశాయి. ఐదో సినిమా 'అఖండ-2- తాండవంస‌ (akhanda 2) వంద కోట్లకు పైగా వసూళ్ళు చూసినా పెట్టుబడికి తగిన లాభాలు చూడలేక పోయింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య నటించబోయే 111వ చిత్రానికి భారీగా బడ్జెట్ తగ్గించారని టాక్. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా రూపొందనున్న చిత్రం తొలుత పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుందని వినిపించింది.

అయితే ప్రస్తుతం నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్ చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, తద్వారా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ లోనూ తేడా కనిపించడం జరుగుతోంది. దీనిని ముందుగానే అరికట్టేందుకు తమ చిత్రం బడ్జెట్ ను సగానికి సగం బాలయ్య తగ్గించారని సమాచారం. అందులో భాగంగానే ముందుగా అనుకున్న ఫాంటసీ మూవీ స్థానంలో ఓ కుటుంబ కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వలన ముందుగా అనుకున్న దానికంటే దాదాపు 60 కోట్ల వ్యయం తగ్గుతుందని వినిపిస్తోంది.

నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుందని, తద్వారా పరిశ్రమ సైతం కళకళలాడుతుందని యన్టీఆర్ తరం హీరోలు నిరూపించారు. సదా తండ్రి అడుగుజాడల్లో నడిచే బాలయ్య తన సినిమా నిర్మాణవ్యయం బాగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మేకర్స్ కు సూచించినట్టు తెలుస్తోంది. పెట్టుబడికి తగ్గ రాబడి చూస్తే నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మించడానికి ముందుకు సాగుతారు. లేదంటే వారిపై అప్పులు కుప్పలుగా చేరిపోతాయి.

తద్వారా నిర్మాతలు ఎంతటి వరైటీ పాయింట్ తో మూవీస్ రూపొందించినా, సదరు చిత్రం విడుదల సమయంలో పాత బాకీలు అడ్డంగా నిలుస్తాయి. అప్పుడు సరైన సమయంలో నిర్మాతలు తమ చిత్రాలను జనం ముందుకు తీసుకురాలేరు. మొన్న బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ-2'కు అలాంటి పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి తనతో చిత్రాలు తీసే నిర్మాతలకు ఎదురు కాకూడదు అన్నదే బాలకృష్ణ భావన.

బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించబోయే చిత్రం షూటింగ్ మార్చి నుండి మొదలు కానుంది. ఈ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. అన్ని వర్గాలను అలరించే కుటుంబ కథతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్ళనుంది. గతంలో పలు కుటుంబకథా చిత్రాలతోనే భారీ విజయాలను చూశారు బాలయ్య. అందువల్ల ఈ మూవీని కూడా అందరినీ అలరించే రీతిలో తెరకెక్కించాలని గోపీచంద్ మలినేని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు 'వీరసింహారెడ్డి'తో బాలయ్యకు బంపర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని, ఈ సారి ఎలాంటి విజయాన్ని తన హీరోకు అందిస్తారో చూడాలి.

Updated Date - Jan 27 , 2026 | 10:56 PM