సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘బేబీ’ కథ వివాదం.. సాయి రాజేష్, SKNలకు హైకోర్టు నోటీసులు!

ABN, Publish Date - Nov 29 , 2026 | 10:23 AM

‘బేబీ’ సినిమా కథ తనదేనంటూ దర్శకుడు శిరిన్ శ్రీరామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKNలకు నోటీసులు జారీ చేసింది.

‘బేబీ’ సినిమా కథ తనదేనంటూ దర్శకుడు శిరిన్ శ్రీరామ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKNలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

‘ప్రేమించొద్దు’ కథతో మొదలైన వివాదం!

శిరిన్ శ్రీరామ్ తన రచయితల బృందంతో కలిసి ‘ప్రేమించొద్దు’ (Preminchoddu) పేరుతో ఓ కథను అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించాలనే ఆసక్తితో తొలుత దర్శకుడు సాయి రాజేష్ తనను సంప్రదించారని ఆయన వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు శ్రమించి కథను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అయితే, కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత సాయి రాజేష్ తమతో సంబంధం లేకుండా అదే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ‘బేబీ’ చిత్రాన్ని తెరకెక్కించారని శిరిన్ ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా కథను ఉపయోగించడం ద్వారా మోసం చేయడమే కాకుండా, మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘బేబీ లీక్స్’ పేరుతో పుస్తకం కూడా!

ఈ వివాదం తొలిసారిగా 2024 ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. తన కథను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కథను కాపీ చేయడం, మోసం చేయడం వంటి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తన ఆరోపణలకు ఆధారాలున్నాయా? అని పలువురు ప్రశ్నించిన నేపథ్యంలో ‘బేబీ లీక్స్’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

సాయి రాజేష్, SKNలకు నోటీసులు

తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ తరఫున న్యాయవాది జి. సురేందర్ వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKNలకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో చేసిన ఆరోపణలపై తమ వివరణ తెలియజేయాలని ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ కథా హక్కుల వివాదంపై సాయి రాజేష్, SKN ఎలా స్పందిస్తారు? న్యాయస్థానానికి ఎలాంటి వివరణ ఇస్తారు? అనేది చూడాలి.

Updated Date - Nov 29 , 2026 | 10:23 AM