Tollywood Sequels: వామ్మో.. ఇన్ని సీక్వెల్సా.. ఎప్పుడొస్తాయి
ABN, Publish Date - Feb 06 , 2026 | 04:06 PM
ఒకప్పుడు మన దేశంలో సీక్వెల్స్ కు అంత సీన్ లేదు అనే మాట వినిపించేది. 'బాహుబలి (Bahubali)' సిరీస్ ఘనవిజయం సాధించడంతో పలువురు మేకర్స్ సీక్వెల్స్, ఫ్రాంచైజీస్ పై మోజు పెంచుకున్నారు.
Tollywood Sequels: ఒకప్పుడు మన దేశంలో సీక్వెల్స్ కు అంత సీన్ లేదు అనే మాట వినిపించేది. 'బాహుబలి (Bahubali)' సిరీస్ ఘనవిజయం సాధించడంతో పలువురు మేకర్స్ సీక్వెల్స్, ఫ్రాంచైజీస్ పై మోజు పెంచుకున్నారు. ఏస్ మేకర్ మణిరత్నం సైతం రాజమౌళి (Rajamouli) బాటలో పయనిస్తూ 'పొన్నియిన్ సెల్వన్' ను రెండు భాగాల్లో రూపొందించారు. అలా ఎందరో దర్శకులు తమ కథకు ఏదో ఒక సశేషం కార్డ్ వేసేసి తరువాతి భాగం రానుందని చాటింపు వేశారు. అలా వచ్చిన వాటిలో 'పుష్ప (Pushpa)' సిరీస్ బంపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమాకు కూడా మూడో భాగం రావలసి ఉంది. మన తెలుగునాట 'సలార్, కల్కి 2898 ఏడి, ద రాజాసాబ్, దేవర' వంటి భారీ చిత్రాలకు సీక్వెల్స్ రావలసి ఉంది. అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో అంటూ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మధ్య తెలుగులో వెలుగు చూసిన 'సింగిల్' వంటి కొన్ని చిన్న చిత్రాలు సైతం తమ సినిమాలకు సీక్వెల్స్ ఉన్నట్టు ముగింపు ఇచ్చాయి. అదే బాటలో కొందరు నోటెడ్ హీరోస్ మూవీస్ సైతం సాగాయి. ఇక 'కార్తికేయ 3, హిట్ 4, గూఢచారి 2, ఎఫ్ 4' వంటి ఫ్రాంచైజీస్ సైతం క్యూలో ఉన్నాయి. ఇవి కాకుండా 'విరూపాక్ష-2, జాంబిరెడ్డి -2, మంగళవారం -2, బింబిసార-2, హనుమాన్ -2' వంటి సీక్వెల్స్ రావలసి ఉంది. వీటితో పాటు 'కేఏ' మూవీకి కూడా ఓ సీక్వెల్ రానుందట. 'ఈగల్' సినిమా సైతం తరువాతి భాగం కొనసాగిస్తుందని ప్రకటించారు. అయితే వీటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అందువల్ల వాటి సీక్వెల్స్, ఫ్రాంచైజీ నెక్ట్స్ పార్ట్స్ వస్తాయో రావో చెప్పలేం.
ఇక కన్నడ, మళయాళ, తమిళ సినిమా రంగాల విషయానికి వస్తే కన్నడ నుండి 'కేజీఎఫ్-3' వంటి క్రేజీ సీక్వెల్ రావలసి ఉంది. మళయాళంలో 'దృశ్యం-3' ముస్తాబవుతోంది. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే 'విక్రమ్ -2, జైలర్-2, ఖైదీ -2, లియో-2, కంగువ-2, ధ్రువ-2' వంటి సినిమాలు అలరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన హిందీ మూవీ 'యానిమల్'కు సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' తెరకెక్కాల్సి ఉంది. ఇలా అన్ని సినిమా రంగాలకు చెందిన సీక్వెల్స్, ఫ్రాంచైజీస్ లెక్క తీస్తే 40 చిత్రాలకు పైనే ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాల్లో ఏవి చెప్పినట్టుగా వస్తాయో, ఏవీ చాప చుట్టేస్తాయో తెలియాల్సి ఉంది. ఫ్లాప్ మూవీస్ కు ఎటూ సీక్వెల్స్ ఇక లేనట్టే అని సినీజనం డిసైడ్ అయ్యారు. మరి రాబోయే సీక్వెల్స్ ఎప్పుడు ప్రేక్షకులను పలకరిస్తాయో చూడాలి.