హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. సినిమా ఆపొద్దంటూ థియేటర్ దగ్గర ధర్నా
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:04 PM
సాధారణంగా ఏదైనా సినిమా బాగోకపోతే థియేటర్ల నుంచి తీసేయమని లేదా టికెట్ ధరలు తగ్గించమని ధర్నాలు చేయడం చూస్తుంటాం. కానీ ఒక సినిమా నచ్చి, దానిని థియేటర్ నుంచి తీసేసినందుకు మళ్లీ ప్రదర్శించాలంటూ ప్రేక్షకులు, భక్తులు రోడ్డెక్కి ధర్నా చేసిన అరుదైన ఘటన తెలంగాణలో వెలుగు చూసింది.
సాధారణంగా ఏదైనా సినిమా బాగోకపోతే థియేటర్ల నుంచి తీసేయమని లేదా టికెట్ ధరలు తగ్గించమని ధర్నాలు చేయడం చూస్తుంటాం. కానీ ఒక సినిమా నచ్చి, దానిని థియేటర్ నుంచి తీసేసినందుకు మళ్లీ ప్రదర్శించాలంటూ ప్రేక్షకులు, భక్తులు రోడ్డెక్కి ధర్నా చేసిన అరుదైన ఘటన తెలంగాణలో వెలుగు చూసింది. ఇలాంటి ఒక సంఘటన ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలోనే లేదు. అలాంటి రికార్డును అందుకున్న సినిమా ఇరుముడి. మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవాడమే కాకుండా 4 రోజుల్లోనే వందకోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయినా కూడా ఆగకుండా థియేటర్ లో ఫుల్ క్రౌడ్ తో దూసుకుపోతుంది.
ఇక ఈలోపే.. దిల్ రాజు ఇరుముడికి బ్రేక్ వేశాడు. తెలుగులో ఆయన రిలీజ్ చేసిన టాక్సిక్ సినిమా కోసం కొన్ని ఏరియాలలో ఇరుముడి సినిమాను థియేటర్ నుంచి తీసేశారు. దీంతో ఇరుముడి సినిమాను మళ్లీ థియేటర్ లో ప్రదర్శించాలని, షోలను కొనసాగించాలని తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ప్రజలు ధర్నాకు దిగారు. ఆ ఊరిలో ఉన్న వెంకటరమణ థియేటర్ నుంచి బుధవారం రోజున ఈ సినిమాను హఠాత్తుగా తొలగించడంతో ఈ వివాదం మొదలైంది.
సినిమా ఆటలను నిలిపివేయడంతో ఆగ్రహించిన పరిసర గ్రామాల ప్రజలు, అయ్యప్ప భక్తులు, సినీ ప్రియులు పెద్ద సంఖ్యలో థియేటర్ ముందుకు చేరుకుని ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఇరుముడి సినిమాను వెంటనే తిరిగి థియేటర్‌లో ప్రదర్శించాలని, షోలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఒక సినిమా ప్రదర్శన కోసం ప్రేక్షకులు ఇలా ధర్నాకు దిగడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదని, ఇది రవితేజ ది గ్రేటెస్ట్ కంబ్యాక్ కు,సినిమా సాధించిన సక్సెస్‌కు నిదర్శనమని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.