కారుతో ఢీకొట్టి పరార్.... 'తొలిప్రేమ' వాసుకి కొడుకు అరెస్ట్
ABN, Publish Date - Sep 01 , 2026 | 03:13 PM
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టిటిడి (TTD) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టిటిడి (TTD) బోర్డు మెంబర్ ఆనంద్ సాయి (Anand Sai) కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు ఆనంద్ సాయి, ప్రముఖ నటి వాసుకి (Vasuki) దంపతుల కుమారుడే ఈ సందీప్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని మొదట ఒక ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. ఆ గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు జైద్‌షా కద్రీ అనే విద్యార్థి సహాయం చేస్తుండగా, సందీప్ నడుపుతున్న మహీంద్రా కారు అత్యంత వేగంగా వచ్చి వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందులాల్ అక్కడికక్కడే మృతి చెందగా, విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా సందీప్ అక్కడి నుండి పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును సీజ్ చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.