అర్జున్ సర్జా: పవన్‌క ల్యాణ్‌ను కలిసినప్పుడు ఆయనిచ్చిన మాట ఏంటంటే..
ABN, Publish Date - Feb 12 , 2026 | 08:52 PM
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ధ్రువ సర్జా స్పెషల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja) దర్శకత్వంలో నిరంజన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ధ్రువ సర్జా స్పెషల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అర్జున్ మీడియాతో మాట్లాడారు. (Seetha Payanam)
13 ఏళ్ల క్రితం వచ్చిన ఐడియా ఈ కథ. అప్పటి నుంచి అలా నా మెదడులో మెదులుతూనే ఉంది. నా కూతురికి అప్పుడే ఈ పాయింట్‌ను చెప్పాను. అలా కథ మొత్తాన్ని ఫినిష్ చేశాను. ఇలాంటి ఓ మంచి కథతోనే నా కూతురిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను. నాకు సినిమా పరిశ్రమ ఎంతో ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తుంటారు. అందుకే ఐశ్వర్యని తెలుగులో లాంచ్ చేయాలని అనుకున్నాను. కొడుకులే కాదు, కూతుర్లు కూడా వారసులే. అసలు అలా బేధం చూపకూడదు. వాళ్ల అభిరుచులకు తగ్గట్టు మనం సపోర్ట్ చేయాలి. మా అమ్మాయికి నటన పట్ల ఆసక్తి ఉంది. అందుకే సినిమాల్లోకి తీసుకు వచ్చాను. ‘సీతా పయనం’ మూవీని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను. జెన్ జీ నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూడదగ్గ చిత్రమిది.
విశ్వక్ సేన్ తో ఇష్యూ లేదు...
మొదట ఈ సినిమాను విశ్వక్ సేన్ తో చేయాలనుకున్నాను. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టుగా అన్ని జరగవు కదా. హీరో మారాడు కానీ కథలో ఒక్క సీన్ కూడా మార్చలేదు. విశ్వక్ సేన్‌తో సమస్యలేమీ లేవు. అన్నీ పరిష్కరించుకున్నాం. జీవితం ఒక సర్కిల్ లాంటిది. ఇక్కడ కక్ష సాధింపులు ఏమీ ఉండవు. మళ్లీ సెట్ అయితే కలిసి సినిమా చేస్తాం.
ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి..
ఇదొక మెచ్యూర్డ్ స్టోరీ. ఇందులో కేవలం ప్రేమ కాదు. ఎన్నో రకాల ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాని చూస్తే అవేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఫ్యామిలీ, దేశాన్ని ప్రేమించడం కూడా ఓ దేశభక్తి అవుతుంది. మాస్ ఆడియెన్స్‌కి కావాల్సిన ఫైట్స్ కూడా ఉంటాయి. అనూప్ రూబెన్స్ పాటలు అద్భుతంగా వచ్చాయి. ఆయన ఇచ్చిన రీ-రికార్డింగ్ కూడా సినిమాకు కలిసి వస్తుంది. నేను ఇంతకు ముందు ప్రతీ సినిమాని రెండు, మూడు భాషల్లోనే చేశాను. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేట్ అవుతుంది. ఇదొక ఫీల్ గుడ్ సబ్జెక్ట్. అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుంది. అందుకే నాలుగు భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నాను.
సీక్వెల్ చేయాలనుంది...
‘హనుమాన్ జంక్షన్ 2’ చేయాలని నాక్కూడా ఉంది. ఇటీవల జగపతి బాబుతో మాట్లాడాను. అతను కూడా అదే అన్నాడు. కానీ మంచి కథ సెట్ అవ్వాలి. ఎవరైనా మంచి కథతో వస్తే నేనే నిర్మిస్తాను, దర్శకత్వం వహిస్తాను. ‘జెంటిల్‌మెన్’ చిత్రాన్ని ఇప్పుడు రీ-రిలీజ్ చేయాలని ఉంది. ఇప్పటికీ అప్పటికీ ఏమీ మారలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కూడా ‘జెంటిల్‌మెన్’ చిత్రం సరిపోతుంది. అందుకే ఆ మూవీని రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను.
రాజకీయాలు పడవు...
పవన్ కళ్యాణ్ అతిధిగా ఈ సినిమా మొదలైంది. ఆయన్ను ఐదారు సార్లు మాత్రమే కలిశాను. కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రావాలని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. ఐదు నిమిషాలు అని వెళ్తే మూడు గంటలు ఆయనతో మాట్లాడాను. ఆయన ఎంతో నిజాయితీ గల వ్యక్తి. ఇలాంటి రాజకీయ నాయకుడు ఉండటం గొప్ప విషయం. ‘ఖుషి’ నుంచి నా ఇంట్లో అందరికీ ఆయనంటే ఇష్టం. ‘మీ కోసం మేం ఉన్నాం’ అని చెప్పేందుకు వచ్చాను అని పూజా కార్యక్రమాల్లో ఆయన అన్నారు. నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు. అవి నాకు రాజకీయాలు పడవు. నేను నటిస్తూ, దర్శకత్వం చేస్తూ బాగానే ఉన్నాను కదా. మంచి చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఉంది. కానీ రాజకీయం అనేది వేరే దారి.