Blast: ఇదో మాస్‌ మసాలా ఫిల్మ్‌.. స్టంట్స్ అదిరిపోతాయి

ABN , Publish Date - May 26 , 2026 | 08:06 AM

అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బ్లాస్ట్ జోన్’ ఈనెల 28న విడుదల కానుంది. మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంపై అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Blast

మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ అర్జున్‌ సర్జా (Arjun), ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan), అభిరామి (Abhirami) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బ్లాస్ట్‌ జోన్‌’. సుభాశ్‌ కె రాజ్‌ దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అర్జున్‌ సర్జా మాట్లాడుతూ ‘ఈ ‘బ్లాస్ట్‌ జోన్‌’ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది.

మనవాళ్లకు అన్యాయం జరిగితే మనం కచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యం ఎలా నింపాలి? వంటి అద్భుతమైన అంశాలను ఈ చిత్రంలో చర్చించాం.

మహిళా సాధికారతకు కమర్షియల్‌ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రమిది’ అని అన్నారు. అభిరామి మాట్లాడుతూ ‘ఇదో మాస్‌ మసాలా ఫిల్మ్‌. విజువల్స్‌, మ్యూజిక్‌, స్టంట్స్‌ అద్భుతంగా ఉంటాయి’ అని చెప్పారు. ‘మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని చిత్ర దర్శకుడు సుభాశ్‌ కె రాజ్‌ అన్నారు.

Updated Date - May 26 , 2026 | 08:06 AM