'పరమపద సోపానం'లో అర్జున్ అంబటి
ABN, Publish Date - Apr 09 , 2026 | 06:45 PM
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి తాజా చిత్రం 'పరమపద సోపానం' ఈ నెల 24న విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
'అర్ధనారి' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ అంబటి. ఆ తర్వాత అతను కీలక పాత్రలు పోషించిన 'తెప్ప సముద్రం', 'వెడ్డింగ్ డైరీస్' కూడా నటుడిగా మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అయితే సినిమా నటుడిగా కంటే... బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అర్జున్ అంబటి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం అతను రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలోనూ కీలక పాత్రను పోషిస్తున్నాడు. అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పరమపద సోపానం'. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగశివ 'పరమపద సోపానం' చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
'పరమపద సోపానం' సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను మా దర్శకుడు తెరకెక్కించాడు. మాస్ మహరాజా రవితేజ 'ఈగల్'కు సంగీతం అందించిన డేవ్ బాండ్ మా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన 'చిన్ని చిన్ని తప్పులేవో, భూమ్ భూమ్' లిరికల్ సాంగ్స్‌కు, టీజర్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నెల 24న మూవీని రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అర్జున్ అంబటి లుక్ ఇంటెన్స్ ఫీల్‌తో ఆకట్టుకునేలా ఉంది.