Anjali: తొలి సినిమా దర్శకుడితో 20 ఏళ్ల తర్వాత మళ్లీ.
ABN , Publish Date - Sep 26 , 2026 | 10:03 AM
తెలుగు, తమిళ భాషల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి సినీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అందుకున్నారు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి అంజలి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి (Anjali) సినీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అందుకున్నారు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి అంజలి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో వెల్లడించారు. రెండు దశాబ్దాలుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎన్నో విభిన్న పాత్రల్లో నటించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
అంజలి మాట్లాడుతూ "చిత్రపరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్లు అయిపోయాయి. ఇంత సమయం ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు. ఈ సందర్భంగా చాలా మంది నాకు ఫోన్ చేసి, మెసేజ్‌లు చేసి విషెస్ చెబుతున్నారు. వాళ్లందరి ప్రేమ, అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ 20 ఏళ్ల జర్నీని ఒకసారి వెనక్కి చూసుకుంటే చాలా మంచి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నా ఈ ప్రయాణంలో చాలా మంది దర్శకులు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా రామ్‌గారు, వసంత్ బాలన్‌గారు, కార్తిక్ సుబ్బురాజ్‌గారు, సుందర్‌గారు.. ఇలా చాలామంది దర్శకులు నాకు మంచి పాత్రలు ఇచ్చారు. నా కోసం మంచి పాత్రలు రాసిన ప్రతి ఒక్క దర్శకుడికి చాలా థ్యాంక్స్. వాళ్లు నాలోని నటిని నమ్మి అవకాశాలు ఇచ్చారు కాబట్టే నేను ఇన్ని మంచి పాత్రలు చేయగలిగాను. ఈ 20 ఏళ్లలో దాదాపు 55 సినిమాల్లో నటించాను. ఇన్ని సినిమాలు చేశానంటే దాని వెనుక చాలా మంది కష్టం ఉంది. నేను కేవలం హీరోయిన్‌గా కనిపించాలి అనే ఆలోచనతో కాకుండా, మంచి పాత్ర ఉంటే అది ఎలాంటి పాత్ర అయినా చేయాలని ఎప్పుడూ అనుకున్నాను. కమర్షియల్ సినిమాలతో పాటు కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ రెండు భాషల ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. నా మొదటి సినిమా ‘కట్రదు తమిళ్’. ఆ సినిమాకు రామ్ దర్శకుడు. నా కెరీర్‌ను ఆయనతోనే ప్రారంభించాను. మొదటి సినిమాతోనే నాకు చాలా మంచి అనుభవం వచ్చింది. ఆ తర్వాత చాలా మంది దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఒక్కో సినిమా, ఒక్కో పాత్ర నాకు చాలా విషయాలు నేర్పించాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రామ్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆయన దర్శకత్వంలోనే ‘ఏళు కడల్ ఏళు మలై’ సినిమా చేశాను. కెరీర్‌ను ఎక్కడైతే మొదలుపెట్టానో, అదే దర్శకుడితో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు ఎప్పటికీ స్పెషల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నిహారిక కొణిదెల, నివిన్ పాలీతో కలిసి నటించాను. సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమై మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్
సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్ బ్లోయింగ్ డీల్!
గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్